YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో పోలీసుల ఫేక్ కపుల్

విశాఖలో పోలీసుల ఫేక్ కపుల్

విశాఖపట్టణం, మార్చి 11
ఎస్ఐల వేషం వేసి ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారం బయటపడింది. రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం చేసి 12 నుంచి 15 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ మిస్సింగ్ కేసు ఘరానా మోసాన్ని బట్టబయలు చేసింది. ఎస్ఐగా అవతారం ఎత్తి తన చేతిలో మోసపోయిన యువతిని బుట్టలో వేసుకుని ఆమెతో కలిసి అనేకమందిని దోచుకున్నాడు సస్పెన్షన్ కు గురైన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్. ఇప్పుడీ వ్యవహారం విశాఖలో సంచలనం రేపుతోంది.శ్రీకాకుళం జిల్లాకి చెందిన హనుమంతు రమేశ్ అనే వ్యక్తి రైల్వే శాఖలో కొంతమంది ఉన్నతాధికారులతో తనతో సంబంధాలు ఉన్నాయని నిరుద్యోగులను నమ్మించాడు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. వారి నుంచి ఏకంగా 3కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.రమేశ్ తొలుత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు భార్య చెల్లిపై కన్నేశాడు. ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు. రైల్వేలో జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికి రహస్యంగా మరో యువతిని పెళ్లాడి ఆమెను మోసం చేశాడు. రమేశ్ చేతిలో మోసపోయిన యువతి సైతం నిరుద్యోగులకు వల వేయడంలో రమేశ్ కు సహకరించింది. దీంతో ఇద్దరూ కలిసి పోలీస్ అధికారుల గెటప్ వేశారు. ఉద్యోగాలు అంటూ నమ్మించి అందినకాడికి దోచుకునే వారని పోలీసుల విచారణలో తేలింది. నిరుద్యోగులను నమ్మించేందుకు వీరు ఏకంగా ఫేక్ రైల్వే వెబ్ సైట్ ను క్రియేట్ చేశారు. దీని ద్వారా మెయిల్స్ పంపి ఎరవేశారని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత నకిలీ నియామక పత్రాలను చూపిస్తూ మరికొందరి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు నిలదీయటం ప్రారంభించారు. తమ డబ్బు తమకు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో రమేశ్ రెచ్చిపోయాడు. తన వద్దనున్న డమ్మీ మెటల్ రివాల్వర్ తో వారిని బెదిరించాడు. తర్వాత యువతితో కలిసి విశాఖ నుంచి పారిపోయాడు. తన భర్త కనిపించడం లేదని రమేశ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాఫ్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. టెక్నాలజీ సాయంతో నిందితులు హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.

Related Posts