YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ కైట్.. కహానీ.. మారిపోతున్న సమీకరణాలు

కాంగ్రెస్ కైట్.. కహానీ.. మారిపోతున్న సమీకరణాలు

హైదరాబాద్, మార్చి 11
హైదరాబాద్ పాత బస్తీలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న ఎంఐఎం పార్టీ రాజకీయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం మజ్లిస్, బీఆర్ఎస్ లు అవిభక్త కవలలుగా కలిసిమెలిసి ఉన్నాయి. అప్రకటిత మిత్రపక్షాలుగా ఎన్నికలలో ఒకరికి ఒకరు తోడ్పడ్డాయి. అప్రకటిత అనడానికి ఏముంది.. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఎలాంటి దాపరికం లేకుండా  మజ్లిస్, బీఆర్ఎస్ లు మిత్రులు అని బహిరంగంగానే ప్రకటించేశారు.  అయితే మజ్లిస్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే.. ఆ పార్టీ  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే  మిత్రత్వం నెరపింది.   రాష్ట్ర విభజన తరువాత కూడా అదే విధానాన్ని కొనసాగించింది. తెలంగాణ‌లో  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతోనే చెట్టాపట్టాలేసుకు తిరిగింది.  కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఎంఐఎం అధినేత ఒవైసీ ఆయనతో  భుజం భుజం కలిపి నడిచారు.   అధికారం మారిన తరువాత ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అందుకే మజ్లిస్ పార్టీ విధానం, లక్ష్యం కూడా  పాత‌బ‌స్తీలో త‌న పట్టు నిలుపుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీఆర్ఎస్ కు దూరం జరిగే  ప్రయత్నాలు ప్రారంభించారు. అసలు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఓటమి పాలౌతుందన్న అంచనాలు, సర్వేలు వెలువడటం మొదలు పెట్టినప్పటి నుంచే బీఆర్ఎస్, మజ్లిస్ మధ్య మైత్రీ బంధం సడలిందని పరిశీలకులు ఉదాహరణలతో సహా  విశ్లేషణలు చేశారు. రేవంత్ సీఎం పగ్గాలు అందుకున్న తరువాత సందేహాలకు అతీతంగా బీఆర్ఎస్ కు మజ్లిస్ దూరం జరిగిందని తేలిపోయింది.  మేడిగడ్డ సందర్శనకు రేవంత్ సర్కార్ ఆహ్వానాన్ని మజ్లిస్  మన్నించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో పాటు మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. బీఆర్ఎస్ ఆ ఆహ్వానాన్ని మన్నించలేదు. మేడిగడ్డ సందర్శనకు వెళ్లలేదు. అయినా లెక్క చేయకుండా మజ్లిస్ ఎమ్మెల్యేలు మాత్రం తాము కాంగ్రెస్ తోనే ఉన్నామని చాటేందుకు మేడిగడ్డ సందర్శన కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు.  వాస్తవానికి   ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ కూడా బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. మద్యం కుంభకోణం కేసు విషయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లభించిన,   వెసులు బాట్లను  కాంగ్రెస్ ఉదాహరణలుగా చూపుతూ ఆ రెంటి రహస్య మైత్రినీ ఎండగడుతూ వచ్చింది.  ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతికి బ్రాండ్ అన్న ఆరోపణలను సైతం కాంగ్రెస్ గతంలోనే చేసింది. అయితే అప్పట్లో ఈ విషయాలను వేటినీ పట్టించుకోని మజ్లిస్ రాష్ట్రంలో బీఆర్ఎస్ గద్దె దిగడంతోనే కాంగ్రెస్ ఆరోపణలు వాస్తవమేనంటూ గళం సవరించుకుంది. మజ్లిస్ బీఆర్ఎస్ కు దూరం జరగడం, కాంగ్రెస్ కు  దగ్గరవ్వడం అనూహ్య పరిణామం ఏమీ కాదు.  ఎందుకంటే ఆ పార్టీ రాష్ట్రంలో  అధికారంలో  ఉన్న పార్టీతోనే నడుస్తుందన్న విషయం తెలిసిందే. ఎందుకంటే  పాత బస్తీలో తన పట్టు నిలుపుకోవాలంటే మజ్లిస్ కు రాష్ట్రంలో అధికార పార్టీ అండ అవసరం. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. రేవంత్ రెడ్డి సర్కార్ కు అవసరమైన మెజారిటీ కంటే నాలుగైదు సీట్లు మాత్రమే అధికంగా ఉన్నాయి. పదేళ్ల తరువాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ లో ఇప్పుడు కనిపిస్తున్న ఐక్యత ఎంత కాలం ఉంటుందన్నది, ఆ పార్టీ గురించి తెలిసిన వారంతా అనుమానమే అంటున్నారు. అసంతృప్తి బీజాలు మొలకెత్తి, జంపింగుల భయం ఆ పార్టీని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ ను వెన్నాడుతూనే ఉంటుంది.  అందుకే రేవంత్ తన ప్రభుత్వాన్ని సుస్థిరంగా కొనసాగించే ధీమా కోసం ఆయన మజ్లిస్ మైత్రిని మద్దతును సహజంగానే  కోరుకుంటారు.  అందుకే పరస్పర ప్రయోజనాల పరిరక్షణలో భాగమే మజ్లిస్, కాంగ్రెస్ దోస్తానా అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related Posts