YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆ నలుగురికి కనుగోలు సునీల్ గ్రీన్ సిగ్నల్...

ఆ నలుగురికి కనుగోలు సునీల్ గ్రీన్ సిగ్నల్...

హైదరాబాద్, మార్చి 11,
తెలంగాణ కాంగ్రెస్ లో మొదటి జాబితాలు పది లేదా పదకొండు మంది అభ్యర్థులు ఉంటారు అనుకుంటే కేవలం నలుగురికి మాత్రమే చోటు దక్కింది. దీంతో అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుందా అన్న చర్చ ప్రారంభమయింది. అభ్యర్థుల ఎంపిక  బాధ్యత అంతా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారని అనుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా అలాగే అనుకున్నారు. మొదటి అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు. రెండో అభ్యర్థిగా ప్రకటించకపోయినా చేవెళ్లలో సభ పెట్టి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి ఓటేయాలన్నట్లుగా ప్రచారం చేశారు. మొదటి జాబితాలో వంశీ చంద్ రెడ్డికి టిక్కెట్ ఖరారైనా  .. పట్నం సునీత పేరు మాత్రం రాలేదు. జహీరాబాద్ కు సురేశ్ షెట్కార్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నల్లగొండ నుంచి కందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బల్ రాం నాయక్ పేర్లను ఖరారు చేసింది. మిగతా స్థానాలు పెండింగ్ లో పెట్టింది.  ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ పంపిన సింగిల్ నేమ్స్ లో బీఆర్ఎస్ నుంచి ఇటీవలే  పార్టీలో చేరిన నలుగురు పేర్లు ఉండటం, వారంతా వరుసగా ఉన్న సెగ్మెంట్లలో పోటీకి దించాలని పీఈసీ ఏకాభిప్రాయానికి రావడం ఈ సర్వేకు కారణమైనట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధును పోటీకి దించాలని నిర్ణయించింది. ఈ నలుగురు కూడా ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు.   దీనిపై  పునరాలోచించాలని భావిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం  మిగతా 13 సెగ్మెంట్లలో ఫ్లాష్ సర్వే చేయించాలని నిర్ణయంచింది. కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు నేతృత్వంలోని సర్వే టీం రంగంలోకి దిగింది. అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసే పనిలో పడిందని తెలుస్తోంది. సర్వే ఆధారంగా టికెట్లను ఫైనల్ చేసే అవకాశం ఉంది.  పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్న వారి అంశాన్ని కూడా సర్వే టీములు ప్రస్తావించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నట్టు సమాచారం. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్‌‌ఎస్ నేత కాంగ్రెస్ లో చేరి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? గెలిచే అవకావం ఉందా..? అనే అంశంపైనా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇలా మరికొన్ని సెగ్మెంట్లలోనూ జాయిన్ చేసుకోబోయే లీడర్ల గురించి .. వారిని అభ్యర్థులుగా ఖరారు చేస్తే ఎలా ఉంటుంది..? అనే అంశాలపైనా ఫీడ్ బ్యాక్ తీసుకొని సర్వే నిర్వహిస్తున్నారు.
వారసుల కోసం నేతల ఆరాటం
 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపు ఉందని గట్టిగా నమ్ముతున్నారు. తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి స్థిరపడేలా చేయడానికి ఇంత కంటే మంచి సమయం ఉండదని అనుకుంటున్నారు. సీనియర్ నేతలంతా.. లోక్ సభ ఎన్నికల్లో తమ వారసులకు లేకపోతే కుటుంబసభ్యులకు టిక్కెట్లు ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు.  పార్టీని అంటి పెట్టుకుని ఉన్నాం కాబట్టి తమకు  ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఉన్న పదిహేడు ఎంపీ సీట్లలో పది చోట్లకుపైగా ఎంపీ టిక్కెట్లు అన్నీ తమ వారసులకే కావాలని సీనియర్ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో హైకమాండ్ తల పట్టుకోవాల్సి వస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. అన్ని చోట్లా..  తమ వారసుల్ని నిలబెట్టడానికి ఆయా ప్రాంతాల సీనియర్లు ప్రయత్నిస్తున్నారు.  తమ వారసులకు టికెట్లు ఇవ్వాలంటూ పార్టీ సీనియర్లు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకుపోతున్నారు. దీంతో ఎంపీ అభ్యర్థుల ఎంపిక పార్టీకి కత్తిమీద సాములా తయారైంది. జనవరి చివరివారంలో ఎంపీ అభ్యర్థుల కోసం పార్టీ నేతల నుంచి కాంగ్రెస్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. దాదాపు 800లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి కొన్ని పేర్లను అధిష్టానానికి పంపింది. కానీ ఎలాంటి హడావుడి లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ పార్లమెంటు అభ్యర్థిగా చల్లా వంశీచంద్‌రెడ్డిని ప్రకటించడంతో అభ్యర్థుల ఎంపిక మరోసారి చర్చనీయాంశంగా మారింది.   పార్టీ సీనియర్లు తమ వారసులకు, కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయంతో చాలా  నియోజకవర్గాల్లో పోటీ కూడా ఎక్కువగానే ఉన్నది. ఇప్పటికే అనేకులు ఎంపీ టికెట్‌ ఆశించి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. మరికొంత మంది వ్యాపారవేత్తలు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. పార్టీ సీనియర్‌ నాయకులు ఉండనే ఉన్నారు. తమకు కాదంటే తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు.అందులో నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కె. జానారెడ్డి తమ వారసుని కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్‌ ఆశించినప్పటికీ ఓ కుమారుడికి నాగార్జున సాగర్ టిక్కెట్ ఇవ్వడంతో  పార్టీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయనకు నల్లగొండ ఎంపీ టిక్కెట్ అడుగుతున్నారు జానారెడ్డి. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వారసుల పోటు ఎక్కువైంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మల్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాదరెడ్డి ప్రయత్నిస్తున్నట్టు ఆ జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. మెదక్‌ నియోజకవర్గం నుంచి తనకు ఎంపీ టికెట్‌ ఇవ్వాలంటూ మైనంపల్లి హన్మంతరావు అడుగుతున్నారు. అదే టికెట్‌ను తన కూతురు త్రిషలకు ఇప్పించుకునేందుకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. తన భార్య నిర్మల కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రయత్నిస్తున్నారు. భార్యకు కాదంటే, తన కూతురుకు ఇవ్వాలని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. పెద్దపల్లి పార్లమెంటు నుంచి తన కుమారుడు గడ్డం వంశీకి టికెట్టు ఇప్పించుకునేందుకు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి కాంగ్రెస్‌ బీఫామ్‌ పొందారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కుమారుడికి టికెట్‌ ఆశిస్తున్నారు.  భువనగిరి నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్యకు ఎంపీ టికెట్‌ లేదా తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. చెవెళ్ల పార్లమెంటు నుంచి పట్నం మహేందర్‌రెడ్డి భార్య రంగారెడ్డి జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డికి టికెట్‌ ఇప్పించుకునేందుకు ఆమెను పార్టీలో చేర్పించారు.   కాంగ్రెస్‌ పార్టీలో వారసులకు టికెట్లు అన్న చర్చపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కార్యకర్తల అండతో రాజకీయంగా ఎదిగిన సీనియర్‌ నేతల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పోస్టర్లు వేయడానికి, జనసమీకరణ చేయడానికి, ప్రతి విషయంలో అండగా ఉన్న తమను కాదని వారసుల కోసం పాకులాడటం సరైందికాదని చెబుతున్నారు. కార్యకర్తలను కాదని తమ కుటుంబ ప్యాకేజీ కోసం తాపత్రాయ పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వారసుల పార్టీ అనే ముద్ర ఉంది. దీన్ని చెరుపుకుని కొత్త నాయకత్వాన్ని పెంచుకుంటేనే.. భవిష్యత్ లో ..  నాయకత్వానికి ఢోకా లేకుండా ఉంటుంది. కానీ సీనియర్ నేతలు..  పార్టీ అంటే తమ ఆస్తి అన్నట్లుగా వ్యవహరిస్తూండటం...  పార్టీ నేతల ఎదుగుదల కోసం కృషిచేసిన వారికి పదవులు కావాలని మాత్రం అడగకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ వారసులకు ఇచ్చిన ప్రాధాన్యతను తప్పుపట్టిన కాంగ్రెస్‌…అదే దారిలో నడుస్తుందన్న నిందలు ఈ కారణంగానే ఎదుర్కోవాల్సివస్తోంది.  అందుకే పార్టీ కోసం కష్టపడి పని చేసిన యువనేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ సీట్ల పంచాయతీని తేల్చడం.. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు అంత తేలిక కాదన్న  అభిప్రాయం వినిపిస్తోంది.

Related Posts