కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుమారస్వామి తొలిసారి అక్కడి రైతులతో సమావేశం అయ్యారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 30 జిల్లాల నుంచి వచ్చిన రైతు ప్రతినిధులతో చర్చించిన వీరిద్దరూ.. రుణమాఫీ ప్రతిపాదనపై సలహాలు, సూచలనలు అడిగి తెలుసుకున్నారు. కాగా రుణమాఫీపై ప్రభుత్వ కార్యాచరణ కోసం 15 రోజుల సమయం కావాలంటూ సీఎం రైతు ప్రతినిధులను కోరారు. భూమి పరిమాణంతో సంబంధం లేకుండా రైతులందరికీ రుణ విముక్తి కల్పిస్తామనీ... రెండు దశల్లో మొత్తం రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.సీఎం ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రైతులు.. జాతీయ వాణిజ్య బ్యాంకులు, కార్పొరేషన్ బ్యాంకులతో సహా అన్ని రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రుణాలు మొత్తం రూ.53 వేల కోట్ల వరకు ఉన్నాయి. కాగా ఇప్పటికే తాను రుణాలకు సంబంధించిన సమాచారం మొత్తం తెప్పించుకున్నామనీ... మిత్రపక్షం కాంగ్రెస్‌తో చర్చలు జరిపిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి పేర్కొన్నారు. బ్యాంకర్లు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరిపిన తర్వాతే రుణమాఫీ పథకాన్ని ప్రకటిస్తామని రైతులకు వివరించారు. అయితే ఈలోగా ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని రైతులను కోరారు.