న్యూఢిల్లీ, మార్చి 11
ఎలక్టోరల్ బాండ్స్‌పై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వీటిని తక్షణమే ఆపేయాలని తేల్చి చెప్పింది. అదే సమయంలో మార్చి 6వతేదీలో ఇందుకు సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచాలని SBIని ఆదేశించింది. అయితే...ఈ గడువులోగా SBI పని పూర్తి చేయలేకపోయింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా...ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 26 రోజులుగా ఏం చేశారంటూ ప్రశ్నించింది. అంతకు ముందు SBI తన వాదనలు వినిపించింది. SBI తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే పూర్తి వివరాలు కోర్టుకి సమర్పించాలంటే మరికొంత సమయం కావాలని కోరారు. ఇప్పటి వరకూ ఉన్న ప్రొసీజర్‌ని పూర్తిగా పరిశీలించాలని చెప్పారు. అంతే కాదు. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో బాండ్‌లు కొనుగోలు చేసిన వాళ్ల వివరాలు ఏమీ లేవని, వాటిని గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం చెప్పిందని వాదించారు. అయితే...ఈ వాదనపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మ్యాచింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలని తాము కోర్టు చెప్పలేదని, తీర్పులో ఆ విషయమే ప్రస్తావించలేదని తేల్చి చెప్పింది. కేవలం ప్రాథమిక వివరాలన్నీ ఇవ్వాలని అడిగినట్టు స్పష్టం చేసింది. ఈ మ్యాచింగ్ పేరు చెప్పి కాలయాపన చేయడం కుదరదని మందలించింది. గడువు కావాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. "మీరు ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచామని చెబుతున్నారు. సీల్డ్ కవర్‌లో ఉంచి ముంబయి బ్రాంచ్‌కి సబ్మిట్ చేసినట్టు వాదిస్తున్నారు. కానీ మేం అడిగింది మీరు ఆ వివరాల్ని మ్యాచ్ చేయాలని కాదు. కేవలం ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎవరెవరు ఎంత డొనేట్ చేశారో ఆ వివరాలు కావాలని అడిగాం. కోర్టు తీర్పుని ఎందుకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు..? సీల్డ్ కవర్‌లో ఉంటే అది తెరిచి మాకు వివరాలు ఇవ్వండి. మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా కేంద్ర ఎన్నికల సంఘం తమ వద్ద ఉన్న వివరాలు వెబ్‌సైట్‌లో ప్రచురించాలి."
- సుప్రీంకోర్టు ధర్మాసనం