తిరుపతి, మార్చి 13,
ఆధ్యాత్మిక నగరం తిరుపతి బలిజలకు సెంటిమెంట్‌గా మారింది. పొత్తుల చిక్కుతో తిరుపతి టికెట్ ఎవరికన్న దానిపై అయోమయం నెలకొంది. వైసీపీ ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ కు టికెట్ కేటాయించగా, ప్రత్యర్థిగా బలిజ సామాజిక వర్గం నుంచి అభ్యర్థి ఉండాలన్న డిమాండ్‌ను ఆ సామాజిక వర్గం బలంగా వినిపించే ప్రయత్నం చేస్తోంది. బలిజ సామాజిక వర్గం ప్రభావితం చూపే తిరుపతి అసెంబ్లీలో పట్టు సాధించాలని బలిజ సామాజిక వర్గం ప్రయత్నిస్తుంది.రాయలసీమలో అత్యంత ప్రాధాన్యత ఉన్న తిరుపతి లాంటి కేంద్రంలో బలిజ సామాజిక వర్గం తమ రాజకీయ ఆధిపత్యం ఉండాలని కోరుకుంటోంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం ఆవిర్భావం తిరుపతి వేదిక జరగా ఆ పార్టీ అధ్యక్షుడిగా చిరంజీవికి తిరుపతి రాజకీయ బిక్ష పెట్టింది. బలిజ సామాజిక వర్గం చిరంజీవిని సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గం నేత పట్టు సాధించలేకపోగా 2014 ఎన్నికల్లో తిరిగి బలిజ సామాజిక వర్గానికి తిరుపతి ఎమ్మెల్యే పీఠం దక్కింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలుతో బలిజలకు తిరుపతిలో ప్రాధాన్యత తగ్గిందన్న అభిప్రాయం చర్చగా మారింది. ఈ నేపథ్యంలో బలిజలకు 2024 సార్వత్రిక ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. 40 వేలకు పైగా ఓటర్లు ఉన్న తిరుపతి నుంచి పోటీ తీసేందుకు బలిజ సామాజిక వర్గంలో పోటీ తీవ్రంగానే ఉంది. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ ఇన్చార్జిగా ఉన్న సుగుణమ్మతో పాటు అర డజను మంది ఆశావాహులు బరిలో నిలిచారు. టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కోడూరు బాలసుబ్రమణ్యం, ఊకా విజయ్ కుమార్, జెబీ శ్రీనివాస్ తో పాటు పలువురు టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా తిరుపతి లో పోటీకి టిడిపికి ఛాన్స్ ఉండదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.జనసేన బరిలో ఉంటే ఆ పార్టీ నుంచి టికెట్‌ను ఆశిస్తున్న వారిలో తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్, చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ పోటీ పడుతున్నారు. తిరుపతిలో వైసీపీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా జనసేన ఇన్‌చార్జిగా కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటమే సాగుతోంది. గత 5 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకే అవకాశం దక్కుతుందన్న ఆశతో కిరణ్ రాయల్ టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా జనసేన హై కమాండ్ ఆర్థికంగా బలమైన నేత కోసం ప్రయత్నిస్తోంది. పక్కా జిల్లా బలిజల కోసం పావులు కలుపుతోంది. ఇందులో భాగంగానే వైసీపీకి రాజీనామా చేసిన చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసుల పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరో ఒకరిద్దరి పేర్లను కూడా జనసేన పరిశీలిస్తుండడంతో తిరుపతిలోని స్థానిక బలిజలు ఏకమవుతున్నారు. టిడిపి నుంచైనా లేదంటే జనసేన నుంచైనా బరిలో ఉండాల్సింది బలిజలేనని, ఆ ఛాన్స్ స్థానిక బలిజలకే దక్కాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బలిజ సేన ఆధ్వర్యంలో మన బలిజ మన తిరుపతి పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించ బోతున్నారు. ఎన్నికల్లోను ఏ పార్టీ అయినా స్థానిక బలిజలకే ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ బలిజ సంఘం నేతలు వినిపిస్తుండగా మరోవైపు టిడిపి జనసేన లోని బలిజ సంఘం నేతలకు ఆయా పార్టీల హై కమాండ్ నుంచి ఇప్పటికే పిలుపు వచ్చింది. స్థానిక బలిజలకే టికెట్ కేటాయించాలన్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటున్న టిడిపి, జనసేన అధిష్ఠానం స్థానిక నేతలతో భేటీకి అవకాశం ఇవ్వడం చర్చగా మారింది. తిరుపతి బలిజల డిమాండ్ మేరకే స్థానికులకు తిరుపతి టికెట్ దక్కుతుందా లేదంటే బలమైన బలిజ సామాజిక వర్గం అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తున్న పార్టీలు ఇతర ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది..!