కాకినాడ, మార్చి 13,
గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. కనీసం పవన్ పై కృతజ్ఞతా భావం చూపకుండా వైసిపిలోకి ఫిరాయించారు. గత ఐదేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే గానే చలామణి అయ్యారు. కనీసం జనసేన బీఫారంపై గెలిచానని కూడా ఆయనకు గుర్తులేదు. తన అధినేత పవన్ కాదు జగన్ అన్నట్టు ప్రవర్తించారు. జగన్ పై ప్రత్యేకతలు విమర్శిస్తే.. సొంత పార్టీ ఎమ్మెల్యేల కంటే వరప్రసాద్ ఎదుర్కొనేవారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి జగన్ రాపాకను సైడ్ చేశారు. రాజోలు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. దీంతో అయిష్టత గానే మొగ్గు చూపారు రాపాక. రోజులు గడుస్తున్న కొలది నాకు అమలాపురం టికెట్ వద్దు.. రాజోలే ముద్దు అంటూ తేల్చి చెబుతున్నారు. నాకు గానీ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వకుంటే రాజోలు నియోజకవర్గం లో వైసీపీ ఓడినట్టేనని తేల్చి చెబుతుండడంతో వైసిపి అధినేత జగన్ మైండ్ బ్లాక్ అవుతోంది. గత ఎన్నికల్లో జనసేన 135కు పైగా స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. పవన్ అయితే రెండు చోట్ల పోటీ చేశారు. కానీ రెండు చోట్ల ఓడిపోయారు. ఇలా అధినేత ఓడిపోయినా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. అయితే పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందినా.. దానిని కూడా వదులుకున్నారు రాపాక. ఎన్నికల అనంతరం ఆరు నెలలకే వైసీపీ గూటికి చేరారు. తనను గెలిపించిన జనసైనికులను విడిచిపెట్టారు. తనకు వైసీపీలో గుర్తింపు ఉందని భావించారు. అటు జగన్ సైతం రాపాక వరప్రసాద్ ను ప్రోత్సహించారు. దీంతో తనకు ఎన్నికల్లో తిరుగు లేదని.. మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రాపాక ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆయన ఒకటి తెలిస్తే.. జగన్ మరోలా తలిచారు. రాజోలు టిక్కెట్ ఇవ్వనని తేల్చేశారు. అమలాపురం ఎంపీగా వెళ్లాలని సూచించారు. తొలుత అదో గౌరవం గా భావించిన రాపాక ఇప్పుడు అసలు విషయాన్ని గ్రహించారు. అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఓటమి ఖాయమన్న సంకేతాలు గుర్తించారు. అందుకే రాజోలు అసెంబ్లీ టికెట్ కోసం పరితపిస్తున్నారు.తాజాగా వైసిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాపాక వరప్రసాద్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు.2014,2019 ఎన్నికల్లో రాజోలు నుంచి వైసీపీ అభ్యర్థి ఓడిపోయిన విషయాన్ని గ్రహించారు. తనకు కాకుండా వేరే ఎవరికైనా సీటు ఇస్తే మరోసారి వైసిపి ఓడిపోవడం ఖాయం అని తేల్చి చెప్పారు. దీంతో ఇది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. అదును చూసి రాపాక దెబ్బ కొట్టారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాపాక వరప్రసాద్ ధిక్కారస్వరం వినిపించినట్టేనని తెలుస్తోంది. ఆయన ఎంపీగా పోటీ చేయడం లేదని ఖాయం అయ్యింది.ఇటీవల టిడిపి టికెట్ నిరాకరించడంతో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరారు. ఇలా ఆయన చేరారో లేదో రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను ఆయనకు కేటాయించారు. ఇది రాపాక వరప్రసాద్ కు మింగుడు పడలేదు. జనసేన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తాను నాయకత్వాన్ని విభేదించి వైసిపి గూటికి చేరుకుంటే ఇలా పక్కన పెడతారా? ఎంపీగా పోటీ చేయమంటారా? టిడిపి నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇస్తారా? అంటూ రాపాక వరప్రసాద్ చిందులు వేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాపాక వరప్రసాద్ చక్కగా వినియోగించుకున్నారు. ఏకంగా నాయకత్వానికి అల్టిమేట్ ఇచ్చారు. గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తే ఓటమి ఖాయమని తేల్చేశారు. దీంతో వరప్రసాద్అమలాపురం ఎంపీగా పోటీ చేయనట్టే. ఆయనపై వైసీపీ హై కమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.