YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒకేసారి టీడీపీ అభ్యర్ధుల ప్రకటన

ఒకేసారి టీడీపీ  అభ్యర్ధుల ప్రకటన

విజయవాడ, మార్చి 13,
టిడిపి అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఒకవైపు భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు సొంత పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. జనసేనతో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఆ రెండు పార్టీల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 94 మందితో తొలి జాబితాను ప్రకటించింది. జనసేన, బిజెపికి కేటాయించిన సీట్లు పోను.. మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ఆ రెండు పార్టీలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది. దీంతో రెండు రోజుల్లో రెండో జాబితాను క్లియర్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో ఆశావహుల్లో ఒక రకమైన టెన్షన్ నెలకొంది.టిడిపి తొలి జాబితాలో చాలామంది సీనియర్లకు టికెట్లు దక్కలేదు.అనూహ్యంగా కొంతమంది జూనియర్లు టికెట్లు దక్కించుకున్నారు.టికెట్లు ప్రకటించని వారిలో పొలిట్ బ్యూరో సభ్యులు సైతం ఉన్నారు. అయితే తొలి జాబితాలో టికెట్లు దక్కని సీనియర్లను పిలిచి చంద్రబాబు బుజ్జగించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీ అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో చాలామంది సీనియర్లు మెత్తబడ్డారు. ఇప్పుడు రెండో జాబితాలో దాదాపు 50 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా వివిధ కారణాలతో టిక్కెట్లు ఇవ్వని వారికి పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకుగాను సీనియర్లతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.మరోవైపు ఎంపీ అభ్యర్థులను సైతం ఖరారు చేసేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నారు. రెండో జాబితాలోనే ఎంపీ అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు రెండు, బిజెపికి ఆరు పార్లమెంట్ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. మిగతా 17 నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేశారు. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపిలో చేరిక ఖాయమైంది. ఒంగోలు సీటును ఆయన కుమారుడు రాఘవరెడ్డికి కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి చాలా చోట్ల ఆశావహులు అధికంగా ఉన్నారు. గుంటూరు లాంటి చోట్ల ఎన్నారైలు సైతం సిద్ధంగా ఉన్నారు. అటు పొత్తుకు కారణమైన బిజెపిలోని ప్రో టిడిపి నేతలు సైతం తమదైన రీతిలో పావులు కదుపుతున్నారు.అన్ని రకాల కసరత్తులు పూర్తిచేసి ఎల్లుండి టిడిపి రెండో జాబితా వెల్లడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఆశావహులు టెన్షన్ తో గడుపుతున్నారు.

Related Posts