YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లకు నాలుగు దశల్లో ఆర్థికసాయం..

ఇందిరమ్మ ఇళ్లకు నాలుగు దశల్లో ఆర్థికసాయం..

హైదరాబాద్, మార్చి 13,
ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. అధికారం లోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే పలు కీలక పథకాలు అమలు చేసి.. చెప్పిందే చేస్తాం అని నిరూపించుకుంటున్నారు రేవంత్‌ రెడ్డి అండ్‌ టీమ్‌. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఇటీవల 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. రూ.500లకే సిలిండర్‌ స్కీం ప్రారంభించింది. తాజాగా మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది రేవంత్‌ సర్కార్‌. ఈ నేపథ్యంలో ఈ పథకానికి అర్హులు ఎవరు, ఎలా ఎంపిక చేస్తారు అనే గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం.పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్‌ సర్కార్‌ చెబుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే గ్యారంటీల అమలుపై దృష్టిపెట్టింది. ఇందుకోసం అభయహస్తం పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తర్వాత ఒక్కో పథకం అమలుకు శ్రీకారం చుడుతోంది. అభయహస్తం దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. గృహజ్యోతి, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి ఇలాగే లబ్ధిదారులను ఎంపిక చేసింది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రకటించింది. ఇల్లులేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థికసాయం అందించబోతుంది. పథకం ఆరంభంలోనే ఇంటి నమూనాను సీఎం విడుదల చేశారు.ఇక ఇందిరమ్మ ఇళ్లు పథకానికి ఎవరు అర్హులంటే.. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌ ప్రకారం.. ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరిట మాత్రమే ఇస్తారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. తొలిదశలో సొంతంగా జాగా ఉండి, అందులో ఇల్లు లేనివారికి ఆర్థికసాయం అందుతుంది. లబ్ధిదారులు స్థానికులై ఉండాలి. అద్దుకు ఉన్నవారు కూడా అర్హులు.ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారల ఎంపిక జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో జరుగుతుంది. కలెక్టర్లు ఫైనల్‌ లిస్టు రెడీ చేస్తారు. గ్రామ పంచాయతీలో ఉన్న జనాభా ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తారు. తర్వాత లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో గ్రామ సభలు, పట్టణాల్లు వార్డు మీటింగ్‌లు నిర్వహించి ప్రకటిస్తారు. తర్వాత ఆర్డీవో ద్వారా కలెక్టర్‌కు పంపిస్తారు. ఇన్‌చార్జి మంత్రి ఫైనల్‌ చేస్తారు.
నాలుగు దశల్లో ఆర్థికసాయం..
ఇక లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం కింద రూ.5 లక్షల సాయం అందిస్తుంది. సొంత జాగా ఉన్నవారికి మొదట సాయం ఇవ్వనున్నారు. మొత్తం నాలుగు దశల్లో ఆర్థికసాయం అందుతుంది. బేస్‌మెంట్‌ పూర్తయ్యాక రూ.లక్ష, స్లాబ్‌ లెవల్‌కు వచ్చాక మరో రూ.లక్ష, స్లాబ్‌ పూర్తయ్యాక రూ.2 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లిస్తుంది. గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరుగకుండా, అవకతవకలకు తావు లేకుండా అర్హులను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు.

Related Posts