YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

డీటిహెచ్ లోకి జియో

డీటిహెచ్ లోకి జియో

టెలికాం రంగంలో సంచలనంలా దూసుకువచ్చిన రిలయన్స్ జియో ప్రత్యర్థి కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతూ అధిక సంఖ్యలో వినియోగదారులను తన వైపుకు తిప్పుకుంటున్నది. అయితే ఈ ఏడాది చివరి వరకు జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా ప్రారంభిస్తుందని తెలుస్తుండగా, ఇప్పటికే రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో న్యూఢిల్లీ, ముంబైలలో పలువురు ఎంపిక చేసిన యూజర్లకు ఆ సేవలను జియో ప్రయోగాత్మకంగా అందిస్తున్నది. బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో ఇప్పుడు ఆయా సిటీల్లో పరీక్షిస్తున్నది.సెప్టెంబర్ 2016లో జియో సేవలు టెలికాం రంగంలో ప్రారంభం కాగా అప్పటి నుంచే ఫైబర్ టు ది హోమ్ పేరిట బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా అందించేందుకు జియో ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే న్యూఢిల్లీ, ముంబైలలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో పరీక్షిస్తున్నది. రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో 100 ఎంబీపీఎస్ స్పీడ్ కలిగిన బ్రాడ్‌బ్యాండ్‌ను యూజర్లకు అందిస్తున్నది. అయితే ఈ సేవలను ఈ ఏడాది చివరి వరకు దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రారంభించాలని జియో ఆలోచిస్తుండగా బ్రాడ్‌బ్యాండ్‌తోపాటు టెలిఫోన్, డీటీహెచ్ సేవలను ఒకే ప్లాన్ కింద అందివ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రూ.1వేయి లోపు ప్లాన్‌లోనే ఏకంగా బ్రాడ్‌బ్యాండ్, వాయిస్ కాల్స్ (వీవోఐపీ), డీటీహెచ్ సేవలను అందించవచ్చని తెలిసింది. జియో టీవీ యాప్ ద్వారా డీటీహెచ్ సేవలను అందించేందుకు జియో సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.మరోవైపు ఎయిర్‌టెల్ కూడా తాను ఇప్పటికే దేశంలోని ఆయా ప్రముఖ నగరాలు, పట్టణాల్లో అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోచనలో ఉంది. జియోకు పోటీగా 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ.2,990 రెంటల్ ప్లాన్‌తో 1200 జీబీ డేటాను ఎయిర్‌టెల్ ఇప్పటికే తన బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు అందిస్తున్నది. అయితే ఇకపై జియో మార్కెట్‌లోకి రానున్న నేపథ్యంలో తన సేవల పరిధిని మరింత విస్తరించాలని ఎయిర్‌టెల్ భావిస్తున్నది. కాగా ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌లో ప్రస్తుతం యూజర్లకు రూ.1099, రూ.1299, రూ.2199 ప్లాన్లలో ఉచితంగా ల్యాండ్‌లైన్ కాలింగ్‌తోపాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఫ్రీగా అందిస్తున్నారు.

Related Posts