గుంటూరు, మార్చి 14
ఎన్నికల్లో ఆర్థికంగా బలమైన నేతలను బరిలో దించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎక్కువ ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉన్న నేతలకు పెద్దపీట వేస్తున్నారు. వారికి ఏరి కోరి టిక్కెట్లు ఇస్తున్నారు. అయితే పార్టీ ఫండ్ రూపంలో సైతం కొంత మొత్తం డిపాజిట్ చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా వైసీపీలో ఈ తరహా ఆరోపణలు బయటకు రావడం విశేషం. టిక్కెట్ల పేరిట పార్టీ ఫండ్ తో పాటు కొంతమంది నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న విషయం బయటపడింది. తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు ఏకంగా మంత్రి విడదల రజినిపై సంచలన ఆరోపణలు చేశారు. చిలకలూరిపేట టిక్కెట్ ఇప్పించేందుకు తన వద్ద నుంచి 6.5 కోట్లు వసూలు చేశారని ఆయన ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీలో వరుసగా విడుదలవుతున్న జాబితాల వెనుక భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ప్రారంభమయ్యాయి.ఇప్పటివరకు వైసీపీ 13 జాబితాలను విడుదల చేసింది. దాదాపు 80 మంది వరకు సిట్టింగ్లను మార్చింది. అయితే ఒక జాబితాలో పేరు.. ప్రకటించి తదుపరి జాబితాలో మార్చుకుంటూ పోతుంది. కొంతమంది ఇన్చార్జిలను నియమించిన అది తాత్కాలికమేనని.. చివరి క్షణంలో ఇతరులు వస్తారని చెప్పుకొస్తోంది. దానికి రకరకాల సమీకరణలను చూపుతోంది. తీరా తొలగించినప్పుడు ఏవేవో కుంటి సాకులు చెబుతున్నారు. అప్పటికే ఇన్చార్జ్ లకు క్షవరం అవుతోంది. టికెట్ కోసం పార్టీకి ఫండింగ్, టిక్కెట్ ఇప్పించారని నేతలకు కమీషన్ కోట్లలో చెల్లిస్తున్నారు. ఫ్లెక్సీలు ఇతరత్రా ఖర్చులకోసం భారీగానే వెచ్చిస్తున్నారు. తీరా చావు కబురు చల్లగా చెబుతున్నారు. టికెట్ లేదని తేల్చేస్తున్నారు. ఇటువంటి బాధితులు వైసీపీలో ఎక్కువగా ఉన్నారు. చిలకలూరిపేటలో మల్లెల రాజేష్ నాయుడు బాధితుడిగా వెలుగు చూశాడు. మంత్రి విడదల రజిని ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. ఆమె స్థానంలో మల్లెల రాజేష్ నాయుడుని నియమించారు. అప్పట్లోనే అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. ఆయన వద్ద 20 కోట్లకు పైగా వదిలించారని సమాచారం. తనకు జరిగిన అన్యాయం పై ఆయన కార్యకర్తల సమావేశం పెట్టుకొని మరీ బాధపడ్డారు. అంత ఖర్చు పెట్టిన తర్వాత ఆయన స్థానంలో వేరొకరిని ఇప్పుడు ఇన్చార్జిగా నియమించారు. అయితే ఒక్క రాజేష్ నాయుడు బాధితుడు కాదు. ఆయనలా చాలా మంది ఉన్నారు. ఇప్పటివరకు 13 జాబితాలను విడుదల చేశారు. మార్చిన వాళ్ళనే మళ్లీ మళ్లీ మారుస్తున్నారు. ఆర్థికంగా బలమైన వాళ్ళు అని చెప్పి సీటిస్తున్నారు. తరువాత తీసేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కోట్లు రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ బ్లాక్ మనీ కావడంతో ఎవరు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.