విశాఖపట్నం జిల్లా మొక్కజొన్న రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. ఈ ఏడాది ఇప్పటికీ.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడమే దీనికి కారణం. వాస్తవానికి ప్రభుత్వం ఏటా మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ దఫా కొనుగోలు కేంద్రాల ఊసే లేకుండా ఉంది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటే సరైన ధర రాదు. మరోవైపు పంటను నిల్వ ఉంచుకుందామంటే మార్కెట్‌లో తగినన్ని గిడ్డంగుల్లేవు. దీంతో పంటను నిల్వ ఉంచుకునే మార్గంలేక.. నష్టానికి అమ్ముకోలేక రైతులు నానాపాట్లు పడుతున్నారు. బాందేవుపురం, పెంట, కోరాడ, రెడ్డిపల్లి, దువ్వుపేట, తునివలస, అనంతవరం, పాండ్రింగి, గంధవరం, మద్ది, విలాస్‌ఖాన్‌పాలెం, పొట్నూరు, పద్మనాభం, ఐనాడ, బొత్సపేట, కృష్ణాపురం, బి.తాళ్లవలస, గెద్దపేట తదితర గ్రామాల్లో మొక్కజొన్నను ఎక్కువగా సాగు చేస్తుంటారు. విత్తనం నాటినప్పటి నుంచే నానాకష్టాలు పడతారు రైతులు. ప్రధానంగా పంట సాగు సమయంలో వర్షాల్లేకపోవడంతో బోరుబావుల నీటితో పంట పండిస్తున్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు, నాటడానికి, కలుపు తీయడానికి కూలీలకు, నీటి కోసం ఇలా అన్నింటికి పెద్ద ఎత్తునే పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతుంటారు రైతులు. ఇన్ని కష్టాలకోర్చి పంట పండించినా సరైన మద్దతుధర రాకపోవడం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం తరపున కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వారంతా నిరాశలో కూరుకుపోయారు.
ఈ ఏడాది పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురిశాయి. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని ఎంతోకొంత పంట చేజిక్కించుకున్నారు. ఇన్ని సమస్యలతో సమకూర్చుకున్న పంటను అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట కొనుగోలుకు ఎవరూ రావడం లేదని పలువుర రైతులు అంటున్నారు. పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదని దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించ లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ప్రతిఏటా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఆ కేంద్రాల్లో రైతులు పంటను అమ్ముకుని ఆర్ధికంగా గట్టెక్కేవవారు. కాని ఇప్పుడా ఛాన్స్ లేకుండా ఉంది. ఈ ఏడాది పంట చేతికొచ్చినా నేటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. అదే సందర్భంలో పంటను నిల్వ ఉంచుకోవడానికి మార్కెట్‌లో గిడ్డంగులు కూడా లేకపోవడం... పంట నిల్వకు రైతులకూ సౌకర్యాలు లేకపోవడం సమస్యాత్మకంగా మారింది. పంటను నిల్వ చేసుకునే దారిలేకపోవడంతో పాడైపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పలువురు రైతులు పంట అమ్ముకోలేకపోయినా పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు మాత్రం తీర్చాల్సి వస్తోంది. పెద్ద మొత్తంలో వడ్డీలు కడుతున్నారు. దీంతో ఈ ఏడాది తాము ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోవడం ఖాయమని పలువురు కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న పంటను సేకరించాలని, సత్వరమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అంతా కోరుతున్నారు.