YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మరో 3 నెలలు ఆధార్ అప్ డేట్ ఫ్రీ....

మరో 3 నెలలు ఆధార్ అప్ డేట్ ఫ్రీ....

ముంబై, మార్చి 14,
ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ప్రస్తుతం, చివరి తేదీగా ఉన్న మార్చి 14ను జూన్ 14 వరకు పెంచింది. దీంతో, ఆధార్‌ కార్డ్‌హోల్డర్లకు మరో 3 నెలల సమయం అందుబాటులోకి వచ్చింది. ఈ గడువులోగా ఆధార్ కార్డ్‌ను పూర్తి ఉచితంగా అప్‌డేట్ ‍‌ చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డ్‌ ఉచిత అప్‌డేషన్‌ లాస్ట్‌ డేట్‌ను పెంచిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఉడాయ్‌ వెల్లడించింది. ఈ ఉచిత సేవ కేవలం మైఆధార్‌ పోర్టల్‌లో (myAadhaar Portal) మాత్రమే అందుబాటులో ఉంటుంది. తుది గడువు పెంపు వల్ల కోట్లాది మంది ఆధార్‌ కార్డ్‌హోల్డర్లు లబ్ధి పొందుతారు. ఆధార్ అనేది 12 అంకెల యూనిక్ ఐడీ నంబర్. దీనిలో కార్డ్‌ హోల్డర్‌ పేరు, జెండర్‌, పుట్టిన తేదీ, చిరునామా నుంచి వేలిముద్రలు (బయోమెట్రిక్), కనుపాపలు (ఐరిస్‌) వంటి సమాచారం మొత్తం ఉంటుంది. ఏ ఒక్క పౌరుడి వేలిముద్రల సమాచారం మరొకరితో సరిపోలదు కాబట్టి, ఆధార్ చాలా ముఖ్యమైన గుర్తింపు కార్డు. దీనివల్ల ఏ వ్యక్తీ తప్పుడు గుర్తింపును సృష్టించలేడు. ఆధార్‌ వచ్చాక నకిలీ గుర్తింపుల సమస్య చాలా వరకు పరిష్కారమైంది. మీ దగ్గర ఉన్న ఆధార్‌ కార్డును ఉడాయ్‌ 10 సంవత్సరాల క్రితం జారీ చేసినట్లయితే, ఇప్పుడు దానిని నవీకరించుకోవాలి. మీ వ్యక్తిగత గుర్తింపు, చిరునామా రుజువును ఆధార్‌లో అప్‌డేట్‌ చేయాలి. ఒకవేళ, మొదట ఇచ్చిన వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోతే మళ్లీ అవే వివరాలను సమర్పించాలి. దీనివల్ల, ప్రజలకు సంబంధించిన కొత్త, సరైన సమాచారం ఆధార్‌లో నిక్షిప్తమవుతుంది. దీంతో సేవల స్థాయి మరింత మెరుగుపడుతుంది.
ఆధార్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ఎలా?
ముందుగా, https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. మీ ఆధార్ నంబర్ & OTP సాయంతో లాగిన్ అవ్వాలి.
లాగిన్‌ కాగానే మీ వ్యక్తిగత సమాచారం స్క్రీన్‌ మీద కనిపిస్తుంది.
మీ ప్రొఫైల్‌లో, మీ గుర్తింపు & చిరునామాకు సంబంధించిన సమాచారం ఉంటుంది.
మీ వివరాలు సరైనవి అయితే, వెరిఫై మీద క్లిక్ చేయండి. సమాచారం సరిగ్గా లేకుంటే, కొత్త గుర్తింపు కార్డును అప్‌లోడ్ చేసే ఆప్షన్‌ ఎంచుకోండి. ఆపై దాన్ని అప్‌లోడ్ చేయండి.
అదేవిధంగా, సరైన పత్రాన్ని చిరునామా రుజువుగా ఎంచుకోవాలి. దానిని కూడా అప్‌లోడ్ చేయండి.
ఈ విధంగా ఆన్‌లైన్‌లో మీ ఆధార్‌ను అప్‌డేట్‌ చేయవచ్చు.
ఆధార్‌ను ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ఎలా? ‍‌
https://bhuvan.nrsc.gov.in/aadhaar/కి వెళ్లాలి.
ఇక్కడ, అన్ని ఆధార్ కేంద్రాల వివరాలు కనిపిస్తాయి.
మీరు ఉన్న ప్రాంతాన్ని నమోదు చేసిన తర్వాత, మీకు సమీపంలోని ఆధార్ కేంద్రం గురించిన సమాచారం కనిపిస్తుంది.
మీ ప్రాంతం పిన్ కోడ్ ద్వారా మీకు దగ్గరలో ఎక్కడ ఆధార్ కేంద్రం ఉందో తెలుస్తుంది.
మీరు ఆ ఆధార్‌ కేంద్రం దగ్గరకు వెళ్లి, మీ ఆధార్‌ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.

Related Posts