YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆటో ఓనర్లకా... డ్రైవర్లుకా...

ఆటో ఓనర్లకా... డ్రైవర్లుకా...

వరంగల్, మార్చి 14,
సిక్స్ గ్యారెంటీస్ పథకాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. మహిళలు, ట్రాన్స్ జెండర్స్ తెలంగాణ వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. అయితే ఈ పథకం ప్రారంభం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఇంకా లోటు బడ్జెట్‌లోకి నెడుతుందని రాజకీయ నాయకులు ఆరోపిస్తుండగా.. ఫ్రీ టికెట్ మూలంగా డబ్బులు చెల్లించే మాకు సీట్లు దొరకడం లేదని పురుషులు ఆందోళన వ్యక్తం చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. మరోవైపు మహిళలు ఉచిత ప్రయాణం కారణంగా ఆటోలు ఎవరూ ఎక్కడం లేదని ఆటో డ్రైవర్లు రోడ్డేక్కిన విషయం తెలిసిందే.ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ వల్ల తాము వీధిన పడ్డామని, కుటుంబ పోషణ భారమైందని ఆటోడ్రైవర్స్ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనల బాట పట్టారు. వీరికి బీఆర్ఎస్, బీజేపీలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12 వేల జీవన భృతి కల్పిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం మీడియా ముఖంగా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఏడాదికి రూ.12 వేలు మనిషి జీవనానికి ఎలా సరిపోతాయని ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. రోజుకు రూ.33 పడుతుందని ఆ డబ్బులతో కనీసం టీ కూడా వచ్చే పరిస్థితి తెలంగాణలో లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇస్తే నెలకు రూ.12 వేల జీవన భృతి ఇవ్వాలని లేకపోతే మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.జీవన భృతి చెల్లిస్తామని ప్రకటించి నెల రోజులు అవుతున్నా.. నేటికి ఆ పథకాన్ని కూడా అమలు చేయలేదని, అసలు డబ్బులు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడుతున్నారు. ఇచ్చే రూ.12 వేలు కూడా ఆటో యజమానికి ఇస్తారా..? లేక డ్రైవర్‌కు ఇస్తారా అన్నది క్లారిటీ ఇవ్వలేదని వాపోయారు. ఆ పథకానికి ఇంకా విధివిధానాలు కూడా తయారీ చేయలేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉచితంగా డబ్బులు ఇస్తూ రాష్ట్ర ఖజానాపై భారం మోపేకంటే ఉచిత బస్ సౌకర్యాన్ని తొలగించి లక్షాలది మంది ఆటో కార్మికులను కాపాడాలని ఆటోవాలాలు కోరుతున్నారు.

Related Posts