ప్రతి ఏటా మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది నేటికీ ఏర్పాటు చేయలేదు. పంట కొనుగోలుకు ఎవరూ రావడం లేదు. పంటను నిల్వ ఉంచుకుందామంటే మార్కెట్‌లో గిడ్డంగుల్లేవు. దీంతో పంటలను ఉంచుకోలేక, అమ్మలేక రైతులు తీవ్ర ఇబంది పడుతున్నారు.
మొక్కజోన్న పంటను మండలంలోని అనంతవరం, మద్ది, విలాస్‌ఖాన్‌పాలెం, పొట్నూరు, పద్మనాభం, కృష్ణాపురం, పాండ్రింగి, గంధవరం, బాందేవుపురం, పెంట, కోరాడ, రెడ్డిపల్లి, దువ్వుపేట, తునివలస, బి.తాళ్లవలస, ఐనాడ, బొత్సపేట, గెద్దపేట తదితర గ్రామాల్లో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు నానా యాతన పడాల్సి వస్తోంది. ప్రధానంగా పంట సాగు సమయంలో వర్షాల్లేకపోవడంతో బోరుబావుల నీటితో పంట పండిస్తున్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు, నాటడానికి, కలుపు తీయడానికి కూలీలకు, నీటి కోసం ఇలా అన్నింటికి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. వడ్డీలకు అప్పులు తెచ్చి ఈ పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చే సమయంలో చిన్న చిన్న వానలు కురవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.ఇన్ని కష్టనష్టాలకోర్చి పంట పండిస్తే దానిని అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట కొనుగోలుకు ఎవరూ రావడం లేదు. పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించ లేదు. ప్రభుత్వం ప్రతిఏటా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఆ కేంద్రాల్లో రైతులు పంటను అమ్ముకునేవారు. కాని ఈ ఏడాది పంట చేతికొచ్చినా నేటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. అదే సందర్భంలో పంటను నిల్వ ఉంచుకోవడానికి మార్కెట్‌లో గిడ్డంగులు కూడా లేవు. రైతుల వద్ద ఎటువంటి సౌకర్యాలు లేవు. దీంతో పంట పాడైపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పంట అమ్ముకోలేకపోయినా పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చాల్సి వస్తోంది. దీంతో మొక్కజొన్న పంట వేయడానికి కూడా రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి పంట నిల్వకు గిడ్డంగులు ఏర్పాటు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు