YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎన్నికల కమిషనర్‌లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధు ఎంపిక

ఎన్నికల కమిషనర్‌లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధు ఎంపిక

న్యూఢిల్లీ మార్చ్ 14
 బ్యూరోక్రాట్‌లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధును ఎన్నికల కమిషనర్‌లుగా ఎంపిక చేశారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధు 1988 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారులు. పంజాబ్‌కు చెందిన సంధు ఉత్తరాఖండ్ ఐఏఎస్ కేడర్‌కు చెందినవారు. జ్ఞానేష్ కుమార్ కేరళ కేడర్‌కు చెందినవారు. సంధు గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో సహా పలు కీలక ప్రభుత్వ పదవులు చేపట్టారు. జ్ఞానేష్‌ కుమార్‌ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతోపాటు అమిత్ షా నేతృత్వంలోని సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు.కాగా, ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి సెలక్షన్ బోర్డు గురువారం ఉదయం సమావేశమైంది. కమిటీ సభ్యులలో ఒకరైన అధిర్ రంజన్ చౌదరి ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి పరిశీలన కోసం తనకు 212 పేర్లు ఇచ్చారని ఆయన తెలిపారు. సమావేశానికి ముందు ఆరుగురితో కూడిన షార్ట్‌లిస్ట్ పేర్లను తనకు ఇచ్చారని చెప్పారు. ‘మెజారిటీ వారికి ఉంది. కాబట్టి వారు తమకు కావలసిన అభ్యర్థులను ఎంచుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. అలాగే ఎంపిక విధానాన్ని తాను ప్రశ్నించానని, దీనిపై అసంతృప్తి లేఖ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Related Posts