విజయవాడ నగర రోడ్లపైకి వేలాది మంది వాహనదారులు లైసెన్స్ లేకుండా దూసుకువస్తున్నారు. లైసెన్స్ లేకుండా వేలాది మంది వాహనదారులు రోడ్లపైకి రావడంతో నగర వాసులు బెంబెలెత్తిపోతున్నారు. పరిస్థితి చేయి దాటి పోకుండా రవాణాశాఖ అప్రమత్తమైంది. సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. నగరంలో ప్రతి నిత్యం సుమారుగా 5లక్షలకు పైగా వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. వీటిలో సింహభాగం ద్విచక్ర వాహనాలే. రెండేళ్ల కాలంలో కొత్తగా 1.75లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇటీవల కాలంలో లైసెన్స్ లేకుండా వాహనాదారులు అడ్డూ అదుపు లేకుండా రోడ్లపై చెలరేగుతున్నారు. ఈ క్రమంలో రవాణాశాఖ ముందుగా కొరడా ఝళిపించింది. వాహనాల తనిఖీలు చేసేందుకు స్పెషల్‌డ్రైవ్ చేపట్టింది.జిల్లాలో మచిలీ పట్నం, గుడివాడ, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట ఏరియాల్లో రవాణా అధికారులు ఎల్‌ఎల్‌ఆర్ మేళాలు నిర్వహించారు. ఏడాది కాలంలో 6500మందికి కొత్తగా లైసెన్స్‌లు జారీ చేశారు. తాజగా జూన్ 3వ తేదీన విజయవాడలో మెగా ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహిస్తోంది. ఈ మేళా ద్వారా దాదాపు నగర వ్యాప్తంగా 10వేల మందికి ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీ చేయాలనే లక్ష్యంతో ప్రైవేటు సంస్థల సాంకేతిక సహకారంతో ఎల్‌ఎల్‌ఆర్ టెస్ట్‌లు నిర్వహించటానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఎల్‌ఎల్‌ఆర్ మేళాపై కరపత్రాల ద్వారా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.తనిఖీల్లో వేలాది మంది లైసెన్స్ లేని వాహనదారులు రోడ్లపైకి వస్తున్నట్లు తేలింది. 2016లో 19,617 కేసులు, 2017లో 14,066 కేసులు, 2018లో ఇప్పటివరకు 3వేల మంది లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో మైనర్లు, మహిళలు ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. లైసెన్స్ లేని వారిపై మరింత కఠిన చర్యలకు రవాణాశాఖ దిగింది. మూడు నెలల్లో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 270 మందికి కోర్టు ద్వారా జైలు శిక్ష కూడా విధించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయినా వారిలో మార్పురాక పోవటంతో రవాణా శాఖ వినూత్నంగా ఆలోచించి వాహనం నడిపే వారందరూ విధిగా లైసెన్స్ పొందే విధంగా ప్రజ లకు అవగాహన కల్పిస్తోంది. కళాశాలలు, విద్యాసంస్థలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కార్యక్రమాల ద్వారా వాహనచోదకులు విధిగా లైసెన్స్ పొందాలని సూచిస్తోంది.