ఒంగోలు, మార్చి 14
ఒంగోలు ఎంపి మాగుంట టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 16న ఎంపి మాగుంట, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నారు. రాఘవరెడ్డికి ఒంగోలు పార్లమెంట్ టిడిపి టికెట్ ఇచ్చేందుకు ఇప్పటికే చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. నేడో, రేపో టిడిపి రెండో జాబితా వెలువడే అవకాశాలు ఉండటంతో ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని మిగిలిని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక విషయంలో మాగుంట సూచనలను టిడిపి అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశాలుఉన్నాయి. టిడిపిలో చేరిన వెంటనే పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టిడిపి అభ్యర్దులతో మాగుంట సమావేశం కానున్నారు. 2014లో టిడిపి టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన మాగుంట కుటుంబానికి ఈసారైనా టిడిపి నుంచి గెలుపు సాధ్యమవుతుందా? అన్న చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది.ఈనెల 16న ఉండవల్లిలో టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఎంపి మాగుంట తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో కలిసి టిడిపి తీర్ధం పుచ్చుకోనున్నారు… సరిగ్గా 2014 ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ ఎంపిగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసిపి టికెట్‌పై పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు… దీంతో విధిలేని పరిస్థితుల్లో టిడిపిలో చేరి బిజెపి-టిడిపి-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసి కేవలం 15 వేల ఓట్ల తేడాతో మాగుంట ఓడిపోయారు… అయితే 2014 ఎన్నికల్లో టిడిపి ఎపిలో అధికారంలోకి రావడంతో మాగుంటను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీకి దించడంతో ఆయన గెలుపొందారు. ఆ సమయంలో మాగుంటకు మంత్రి పదవి ఇస్తారని ఆశించారు. అయితే చంద్రబాబు మాగుంటకు మంత్రి పదవి ఇవ్వలేదు. అనంతరం 2019 ఎన్నికల్లో మాగుంట తిరిగి వైసిపిలో చేరి ఒంగోలు పార్లమెంట్ నుంచి వైసిపి టికెట్‌పై పోటీ చేసి 2.14 లక్షల భారీ మెజార్టీతో గెలుపొందారు. తిరిగి 2024లో కూడా మాగుంట వైసిపి టికెట్‌పై పోటీ చేసేందుకు చివరివరకు పోరాడారు. అయితే ఆయనకు వైసిపి అధినేత, సియం వైయస్ జగన్ ఈసారి ఎంపి టికెట్ ఇచ్చేందుకు ససేమీరా ఒప్పుకోలేదు. మాగుంట కాంబినేషన్ అయితే ఒంగోలుతో పాటు మరో రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్దులు గెలుపొందే అవకాశాలు ఉన్నాయని భావించిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి మాగుంట కోసం చివరి వరకు పార్టీ అధిష్టానంతో పోరాడారు… అయితే బాలినేని ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈసారి మాగుంట తనదారి తాను చూసుకున్నారు… ఫిబ్రవరి 28వ తేదిన మాగుంట పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు… అప్పటికే టిడిపి అధినేత చంద్రబాబుతో టచ్లో ఉన్న మాగుంటకు ఈనెల 16వ తేదిన పార్టీలో చేరేందుకు చంద్రబాబు అనుమతి ఇచ్చారు… దీంతో ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో కలిసి ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.2014 ఎన్నికల్లో వైసిపి టికెట్‌పై ఎంపిగా పోటీ చేసేందుకు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రయత్నించారు. 2009లో కాంగ్రెస్ ఎంపిగా గెలుపొందిన మాగుంట రాష్ట విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడంతో 2014 ఎన్నికలకు ముందు వైసిపిలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే వైవి సుబ్బారెడ్డిని పార్లమెంట్ నుంచి పోటీ చేయించేందుకు వైయస్ జగన్ నిర్ణయించుకోవడంతో మాగుంటకు వైసిపిలో ఛాన్స్ దక్కలేదు. దీంతో టిడిపి పార్టీలో చేరిన మాగుంట 2014 ఎన్నికల్లో టిడిపి టికెట్‌పై పోటీ చేసి కేవలం 15 వేల ఓట్ల తేడాతో వైవి సుబ్బారెడ్డిపై ఓడిపోయారు… ఆ తరువాత జరిగిన పరిణామాల్లో భాగంగా 2019 ఎన్నికలకు ముందు వైసిపిలో చేరిన మాగుంటకు వైవి ని కాదని ఎంపి టికెట్ ఇచ్చింది వైసిపి అధిష్టానం… ఈ ఎన్నికల్లో మాగుంట 2.14 లక్షల మెజారిటీతో వైసిపి నుంచి గెలుపొందారు… అప్పటి నుంచి వైసిపిలో ఎంపిగా కొనసాగుతున్న మాగుంట ఈసారి ఎన్నికల్లో తన రాజకీయ వారసుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీకి నిలబెడుతున్నట్టు ప్రకటించారు. ఆతరువాత రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కోవడం, బెయిల్‌పై బయటకు రావడం తెలిసిందే. అయితే ఈసారి కూడా మాగుంట కుటుంబానికి వైవి సుబ్బారెడ్డి రూపంలో అడ్డంకి ఎదురైందట…అంతేకాకుండా మరికొన్ని ఇతర కారణాలు కూడా తోడు కావడంతో ఈసారి మాగుంటకు టికెట్ ఇవ్వకుండా వైవి సుబ్బారెడ్డి లేదా ఆయన కుమారుడు వైవి విక్రాంత్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని వైసిపి అధిష్టానం తొలుత నిర్ణయించినట్టు సమాచారం… అయితే అనూహ్య పరిస్థితుల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఒంగోలు ఎంపి అభ్యర్ధిగా సియం అధిష్టానం నిర్ణయిచండంతో మాగుంటకు వైసిపిలో దారులు మూసుకుపోయాయి. దీంతో ఇక విధిలేని పరిస్థితుల్లో టిడిపి నుంచి పోటీ చేయడానికి మాగుంట కుటుంబం సిద్దమైంది. దీంతో మాగుంట కుటుంబానికి 2014 సీన్ రిపీట్ అయినట్టు చెబుతున్నారు.