YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎల్లుండి నుంచి జిల్లాల్లో నవ నిర్మాణ దీక్షలు

ఎల్లుండి నుంచి జిల్లాల్లో నవ నిర్మాణ దీక్షలు
నవనిర్మాణ దీక్షలకు మళ్లీ రంగం సిద్ధమైంది. దీక్షను మునుపటిలా కాకుండా ఈ ఏడాది పంచాయతీల ప్రాతిపదికన నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పంచాయతీల పరిధి నుంచి ఒక చైతన్యవంతమైన కార్యక్రమంగా నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలు జరగాలన్నది ప్రభుత్వ ఆశయం. దీనికి అనుగుణంగా జూన్‌ రెండో తేదీ నుంచి ఎనిమిది వరకు కార్యక్రమాలను రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండో తేదీన విజయవాడలోని బెంజిసర్కిల్‌ వద్ద ఉదయం తొమ్మిది గంటలకు నవనిర్మాణ దీక్షను ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సీఎం ప్రతిజ్ఞ చేస్తారు. అన్ని జిల్లాల్లోనూ సీఎం ప్రతిజ్ఞను అనుసరిస్తూ, ఊరూరా ప్రజలు దీక్షలో పాల్గొనాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల ఏడాది కావటంతో పంచాయతీ, వార్డు స్థాయిలోని ప్రజల భాగస్వామ్యం పెరిగేలా శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోని పంచాయతీల్లో జూన్‌ రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించారు. రెండో తేదీన ఉదయం నవనిర్మాణ ప్రతిజ్ఞ అనంతరం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం -విభజన హామీలు అమలుపై చర్చించి గ్రామాల్లో ప్రచారం చేయాలి. మూడో తేదీన నీటి భద్రత కరవు రహిత రాష్ట్రంపై గ్రామసభలో సాయంత్రం చర్చించాలి. గ్రామం పరిధిలోని నీటి భద్రత గురించి ప్రజలు చర్చించాలి. నాలుగో తేదీన రైతు సంక్షేమం -ఆహారభద్రత గురించి గ్రామం యూనిట్‌గా చర్చించాలి. అభివృద్ధికి ప్రణాళికలను తయారు చేయాలి. అయిదో తేదీన సంక్షేమం సాధికారత గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రామంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సాధికారతకు తీసుకున్న చర్యలపై చర్చించాలి. ఆరో తేదీన జ్ఞానభూమి ఉపాధికల్పన అంశంపై మానవ వనరుల అభివృద్ధి, అక్షరాస్యత సాధన, విజువల్‌ తరగతి గదులు, డిజిటల్‌ తరగతి గదులు, ఉన్నత విద్య, ఉపాధికల్పనలో శిక్షణ అంశాలపై చర్చించి ఆ గ్రామం పరిధిలో సాధించిన ప్రగతి గురించి చర్చించాలి. ఏడో తేదీన మౌలిక సదుపాయాలు మెరుగైన జీవనం అంశం గురించి గ్రామస్థులతో మాట్లాడించాలి. గ్రామంలో రహదారులు, మురుగునీటి పారుదల, విద్యుత్తు సదుపాయం, వీధి దీపాలు, ఫైబర్‌నెట్‌, ఇతర మౌలిక వసతుల గురించి గ్రామస్థులతో చర్చించాలి. ఎనిమిదో తేదీన సుపరిపాలన, అవినీతి రహిత సమాజం, మహాసంకల్పం చేయాలి. ప్రభుత్వ పరిధిలో అమలవుతున్న జవాబుదారీతనం, పారదర్శకత, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌, ఆర్థికాభివృద్ధి ప్రణాళిక- విజన్‌ 2029 లక్ష్యాల సాధన గురించి చివరి రోజున చర్చించాలి. ఈ మార్గదర్శకాల ప్రకారం మహాసంకల్పం అనంతరం గ్రామ ప్రణాళిక తయారు చేసి నోడల్‌ అధికారులు సమర్పించాలిజిల్లాలోని 1029 పంచాయతీల్లో నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలు జరగాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మండల స్థాయిలోని అధికారులను పంచాయతీలకు నోడల్‌ అధికారులుగా నియమించారు. ఆయా పంచాయతీలకు నోడల్‌ అధికారుల ఎంపిక బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించారు.. పంచాయతీ పరిధిలో నవనిర్మాణ దీక్ష అంశాల చర్చతోపాటు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రణాళికలను తయారు చేసుకోవాలి. జన్మభూమి కమిటీలతోపాటు గ్రామంలో ఉన్న వివిధ కమిటీల ప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. కుటుంబ వికాసం, సమాజ వికాసం గురించి గ్రామాల్లో చర్చించాలి. పంచాయతీలు, వార్డుల్లో ప్రభుత్వ నవనిర్మాణ దీక్ష అంశాలను సమగ్రంగా చర్చించాలి. గ్రామస్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ అంశాలపై పోటీలు నిర్వహించాలి. విద్యార్థులను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలి. ఈ కార్యక్రమాల నిర్వహణకు జిల్లాకు రూ.కోటి విడుదల చేశారు. నవనిర్మాణ దీక్ష రోజువారీ కార్యక్రమాలను ఆర్‌టీజీ యాప్‌ ద్వారా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపించాలి. ప్రతి పంచాయతీలో టీవీని ఏర్పాటు చేసి కార్యక్రమాలను గ్రామస్థులకు వివరించేందుకు చర్యలు తీసుకోవాలని నోడల్‌ అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేశారు.

Related Posts