YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో చేరిన ముద్రగడ

వైసీపీలో చేరిన ముద్రగడ

విజయవాడ, మార్చి 15
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం  వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని  క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైసీపీలో చేరారు. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముద్రగడ తొలుత జనసేనలో చేరుతారని భావించినా అలా జరగలేదు. అనంతరం సీఎం ఆదేశాలతో వైసీపీ నేతలు ఆయన్ను కలిసి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో వైసీపీలో చేరి సీఎం జగన్ తరఫున ప్రచారం చేస్తానని ముద్రగడ ప్రకటించారు. ఈ క్రమంలో అధికారికంగా శుక్రవారం వైసీపీ కండువా కప్పుకొన్నారు. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ పేర్కొన్నారు.కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 1983, 1985లో టీడీపీ తరఫున బరిలో నిలిచి విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముద్రగడ కుటుంబం ఆరుసార్లు గెలిచింది. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో పని చేశారు. 1999లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించారు. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముందు వైసీపీలో చేరుతాననే ప్రకటన చేస్తారని భావించినా అలా జరగలేదు. తర్వాత వైసీపీలో చేరేది లేదని.. జనసేనలో చేరుతానని ప్రకటించారు. అనంతరం జనసేన నేతలు ఆయనతో భేటీ అయ్యారు. స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముద్రగడ ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం సాగింది. అలా జరగకపోవడంతో ముద్రగడ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ నేతలతో చర్చల అనంతరం ఆ పార్టీ వైపే మొగ్గు చూపారు. ఈ క్రమంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు.. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు, ముద్రగడ కుమారుడు గిరిబాబుకు నామినేటెడ్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నెల 14వ తేదీనే తన అనుచరులతో సహా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని ముద్రగడ ప్రకటించారు. ఇందు కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. 'అధిక సంఖ్యలో అనుచరులు వాహనాల్లో తరలి రండి, ఎవరి భోజనాలు వారే తెచ్చుకోండి' అంటూ ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి వరకు భారీ ర్యాలీ చేపట్టి అనంతరం సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరాలని అనుకున్నా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. శుక్రవారం ఒక్కరే వెళ్లి సీఎం సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Related Posts