YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాలనలో రేవంత్ సెంచరీ

పాలనలో రేవంత్ సెంచరీ

హైదరాబాద్, మార్చి 15
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వందరోజుల పాలన పూర్తి చేసుకుంది. డిసెంబర్‌ 7 సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజే ప్రగతి భవన్ వద్ద ఉన్న గేట్లను తొలగించారు. అక్కడ ప్రజల వినతులు స్వీకరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారీగా జనం రావడంతో దీన్ని జిల్లాలకు విస్తరించారు. జిల్లాల్లో సమస్యలు పరిష్కారం కాని వాళ్లు ఇక్కడకు వచ్చి వినతులు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. అంతేనా ప్రగతి భవన్‌కు జ్యోతిరావ్‌పూలే భవన్‌గా నామకరణం చేశారు. అక్కడే భట్టివిక్రమార్కకు అధికారిక నివాస భవనాలు కేటాయించారు. అక్కడి నుంచి మొదలైన సంచలన నిర్ణయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా ఆ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో. ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. ఈ హామీలను అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలుపైనే దృష్టి పెట్టింది రేవంత్ సర్కారు. ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే కీలకమైన రెండు హామీలను అమలు పరిచింది. మొదటిది మహలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, లగ్జరీ బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని డిసెంబర్‌ 9 నుంచి ప్రారంభించింది. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. మహిళలంతా ఆటోలు ఇతర రవాణా సర్వీసులు ఎక్కడం మానేశారు. ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 కోట్ల మంది వరకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అదే రోజు ఆరోగ్య శ్రీ పరిధిని  పది లక్షల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని కూడా ప్రజలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ఈ రెండు పథకాలు అర్హుల డేటా అవసరం లేకుండా అమలు చేయతగిన పథకాలు అందుకే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అమలు చేశారు. కానీ మిగతా పథకాలు అమలు చేయడానికి లబ్ధిదారుల డేటా కచ్చితంగా అవసరం. దీన్ని గ్రహించిన ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 500 రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలంటే కచ్చితంగా డేటా అవసరమని గ్రహించి ప్రజాపాలన దరఖాస్తు ప్రక్రియ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ,గ్రామాన వార్డు వార్డులో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అప్లికేషన్లు తీసుకుంది. వీటిని యుద్ధప్రాతిపదికన స్క్రూట్నీ చేసి లబ్ధిదారుల ఎంపిక మొదలు పెట్టారు. రూల్స్ ఫ్రేమ్ చేసి మరో గృహజ్యోతి పథకంతోపాటు ఐదువందలకే సిలిండర్‌ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు.  ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. దీని కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. వీటితోపాటు మహిళలకు 2వేల ఐదు వంద రూపాయల నగదు బదిలీ, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, రైతులకు 15వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు 12వేల నగదు సాయం పథకాలు అమలులోకి తీసుకురావాల్సి ఉంది. ఎన్నికల హామీల్లో ముఖ్యమైన ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టింది రేవంత్ సర్కారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త ఛైర్మన్‌గా మహేందర్‌ రెడ్డి(ని నియమించింది. పాత గ్రూప్‌ 1 నోటిఫికేషన్ రద్దు చేసి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతోపాటు 11 వేలకుపైగా ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వేసింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు వచ్చి జాయినింగ్ ఆర్డర్స్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి పత్రాలు అందించి వారికి ట్రైనింగ్ ఇస్తోంది. కేంద్రం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన కారణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కేంద్రం నుంచి రావాల్సి నిధులు ఇతర ఆర్థిక వనరులపై అవగాహన వచ్చిన తర్వాత లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ  పెడతామని పేర్కొంది. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార ప్రతిక్షాల మధ్య హాట్‌హాట్‌ డిస్కషన్స్‌ జరిగాయి. భవిష్యత్‌లో అసెంబ్లీ ఎలా ఉండబోతోందో అనే సినిమాకు ముందే ట్రైలర్ ఇచ్చేశాయి. అధికారంలోకి వచ్చిన మొదటిలోనే విద్యుత్, ఆర్థిక, జనలవనరుల విభాగాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాలు రిలీజ్ చేసింది. అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టింది. గత ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత విధానాలతో తెలంగాణ రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పుకొచ్చింది. దీనిపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు నడిచాయి.
మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య వార్ నడిచింది. అక్కడ పిల్లర్లు కుంగాయని చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఎమ్మెల్యేలతో ప్రాజెక్టును సందర్శించింది. జరిగిన విధ్వంసాన్ని ప్రపంచానికి తెలియజేసింది. అనంతరం కొన్ని రోజుల తర్వాత నిజనిర్దారణ పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలు కూడా మీడియాను ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లారు. కృష్ణానదిపై ప్రాజెక్టులు కేఆర్‌ఎంపీకి అప్పగింతపై కూడా తెలంగాణలో దుమారం రేగింది. ఈ విషయంలో బీఆర్‌ఎస్ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా దీనిపై చర్చ నడిచింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు తలెత్తాయిన ఆరోపించిన బీఆర్‌ఎస్‌ నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించి... ఇంతలో అప్పగింత నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సభా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రం, గవర్నర్‌తో ఎలాంటి ఘర్షణపూరిత వాతావరణ లేకుండా స్నేహపూరకంగానే నడుచుకుంటోంది రేవంత్ సర్కారు. గవర్నర్‌తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు రేవంత్. ప్రధాని వచ్చిన ప్రతిసారి ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలుకుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానిని పెద్దన్నతో పోల్చారు. దీనిపై విమర్శులు వస్తే తన స్టైల్‌లో తిప్పికొట్టారు. ప్రధానమంత్రిని రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడుగుతామని... వాటిని ఇవ్వకుంటే నిలదీయడానికి వెనక్కి తగ్గబోమన్నారు. వందరోజుల పాలన పూర్తి చేసుకొని సెంచరీ కొట్టిన రేవంత్‌... ప్రస్తుతానికి సిక్స్‌లు భారీగానే ఉన్నాయి. అదే టైంలో డిఫెన్స్‌లో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి . అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీరు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు పరామర్శించడం, మోడీతో సఖ్యత, గవర్నర్‌కు ఇచ్చిన గౌరవం, అసెంబ్లీలో ప్రతిపక్షాల పట్ల అనుసరించిన తీరు, పార్టీలో అందర్నీ కలుపుకొని వచ్చిన విధానం అన్నింటినీ చూసిన రాజకీయ పరిశీలకులు రేవంత్‌కు 80 శాతం మార్కులు వేయొచ్చని చెబుతున్నారు.అందుకే రేవంత్ కూడా వచ్చే లోక్‌సభ ఎన్నికలను తమ పాలనకు రిఫరెండెమ్‌గా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌... ఎక్కువ సీట్లు గెలుచుకునే దిశగా దూసుకెళ్తోంది. చాలా మంది బీఆర్‌ఎస్, బీజేపీ లీడర్లు కూడా కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. ఆ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్దమవుతున్నారు.

Related Posts