తిరుపతి, మార్చి 16
తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేన దక్కించుకుంది. పొత్తులో భాగంగా ఆ పార్టీ అభ్యర్థి బరిలో దిగనున్నారు. పవన్ కళ్యాణ్ అనూహ్యంగా చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అక్కడ నుంచి పోటీ చేయాలనుకున్న జనసేన నేతలు నిరుత్సాహానికి గురయ్యారు. కిరణ్ రాయల్, హరి ప్రసాద్ వంటి నేతలు ఆశావాహులుగా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరికి సీటు ఖాయమని ప్రచారం జరిగింది. కానీ పవన్ మాత్రం ఇటీవల పార్టీలో చేరిన ఆరణి శ్రీనివాసులకు టికెట్ కేటాయించారు. అందర్నీ ఆశ్చర్యంలో ముంచేత్తారు.వాస్తవానికి తిరుపతి అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అక్కడ టిడిపి ఇన్చార్జిగా సుగుణమ్మ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె అభ్యర్థి అవుతారని అంతా భావించారు. ఒకవేళ జనసేనకు కేటాయించినా.. ఆ పార్టీలోకి వచ్చి జనసేన టికెట్ పై పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో జనసేనలో యాక్టివ్ ఉన్న నాయకుల్లో కిరణ్ రాయల్ ఒకరు. అటు హరిప్రసాద్ సైతం పార్టీలో చాలా యాక్టివ్ గా పని చేస్తూ వస్తున్నారు. పైగా వారు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు. అటు సుగుణమ్మ సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ ముగ్గురిలో ఒకరికి టికెట్ ఖాయమని టాక్ నడిచింది. కానీ అసలు తెరపైకి లేని ఆరణి శ్రీనివాసులకు పవన్ టికెట్ ఇచ్చారు.రాయలసీమలో బలిజలు అధికం. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఆ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ. అందుకే అక్కడ సామాజిక అంశాన్ని పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ మంచి పోటీ చేసిన చిరంజీవిని నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. తరువాత వెంకటరమణ, సుగుణమ్మలను కేవలం సామాజిక వర్గ కోణంలోనే అక్కడ ప్రజలు ఆదరించారు. అందుకే పవన్ మాస్టర్ ప్లాన్ వేశారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులను వైసీపీ నుంచి జనసేనలోకి రప్పించారు. తిరుపతి టికెట్ కేటాయించారు. గతంలో శ్రీనివాసులు ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు. ఆ సన్నిహిత సంబంధాలతోనే ఆయన పవన్ కళ్యాణ్ కు అప్రోచ్ అయ్యారు. తిరుపతి అభ్యర్థిగా మారారు. ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఏకతాటి పైకి వచ్చే అవకాశం ఉంది. పవన్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగినట్లు తెలుస్తోంది.