గుంటూరు, మార్చి 18
వైసీపీ అంటే రెడ్డి సామాజిక వర్గం.. రెడ్డి సామాజిక వర్గం అంటే వైసిపి అన్న రేంజ్ లో పరిస్థితి ఉండేది. కానీ గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు వైసీపీ నుంచి రెడ్డి సామాజికవర్గాన్ని దూరం చేశాయని టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగానే రెడ్డి సామాజిక వర్గం నేతలు పెద్ద ఎత్తున వైసీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. అటు టిడిపి సైతం రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ పెద్ద ఎత్తున టికెట్లు కట్టబెట్టింది. అయితే తనకు ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్న రెడ్డి సామాజిక వర్గాన్ని వదులుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదని జగన్ గ్రహించారు. అందుకే 175 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం వారికి ఎక్కువ సీట్లు కేటాయించారు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి 49 అసెంబ్లీ సీట్లను కట్టబెట్టడం విశేషం. వారి తరువాత బీసీలకు 41 స్థానాలను కేటాయించారు. ఆ తరువాత స్థానంలో కాపులు నిలిచారు. కాపు సామాజిక వర్గానికి 22 సీట్లు కేటాయించారు. అయితే అదే సమయంలో తమ సామాజిక వర్గానికి కేవలం 9 స్థానాలు మాత్రమే కేటాయించడం విశేషం. తద్వారా తమది రెడ్ల పార్టీ అంటూ జగన్ మరోసారి ముద్ర వేసుకున్నారు.తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు రెండు జాబితాలను ప్రకటించింది. మొత్తం 128 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే టిడిపి 28 మంది కమ్మ అభ్యర్థులను ప్రకటించడం విశేషం. అయితే అక్కడే టిడిపి ఒక పాచిక వేసింది. రెడ్డి సామాజిక వర్గానికి సైతం 28 స్థానాలను కేటాయించింది. బీసీలకు 35 స్థానాలు వరకు ఇచ్చింది. అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీటవేసింది. ఇంకా 16 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అటు కూటమి కట్టిన బిజెపి, జనసేన ప్రకటించే అభ్యర్థుల సామాజిక వర్గాలను సైతం పరిగణలో తీసుకోనుంది. ఆ మేరకు లెక్కలు కట్టి ప్రకటించనుంది.అయితేవైసిపి మాత్రం 49 మంది రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులను ప్రకటించడం ఒకరకమైన విమర్శకు కారణమవుతోంది. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనుంది. గత ఐదు సంవత్సరాలుగా రెడ్డి సామాజిక వర్గానికి జగన్ అత్యంత ప్రాధాన్యమించినట్లు విమర్శలు వచ్చాయి. రాజకీయ అవకాశాలతో పాటు యూనివర్సిటీల్లో సైతం అదే సామాజిక వర్గంతో నింపేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో సైతం అదే సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ టిక్కెట్లు కేటాయించడం వెనక జగన్ భయం ఉన్నట్లు విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఆది నుంచి అండగా నిలబడిన రెడ్డి సామాజిక వర్గం తన నుంచి దూరమైందన్న భయంతోనే ఆయన టిక్కెట్లు అధికంగా కేటాయించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంత చేసినా రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి అండగా నిలబడుతుందా? లేదా? అన్నది చూడాలి.