YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీ ప్లాన్ స్టార్ట్ అయిందా..?

బీజేపీ ప్లాన్ స్టార్ట్ అయిందా..?

వరంగల్, మార్చి 18 
తెలంగాణలో ఏం జరుగుతోంది... అందులో బీఆర్ఎస్ - బీజేపీ మధ్య ఏం జరుగుతోంది.? శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్ లో కాలు పెట్టగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మోదీ సభ నిర్వహిస్తే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచే కాక ఏకంగా పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేశారు. ఈ రెండు పరిణామాలకు కారణం బీజేపీయేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా అటు బీఆర్ఎస్ నేతలు కవిత అరెస్టుకు కారణం బీజేపీనే అని ఆరోపిస్తుంటే, బీఆర్ఎస్ - బీఎస్పీ పొత్తును విచ్ఛిన్నం చేసే కుట్రకు బీజేపీ తెర లేపిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఈ రెండు పరిణామాలు చూస్తుంటే తెలంగాణలో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను తమ ప్రత్యర్థి పార్టీల మీదకు ఉసిగొల్పడం సర్వసాధారణమేనని దేశ రాజకీయ చరిత్ర చెబుతోంది. లిక్కర్ కుంభ కోణంలో మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే ఈడీ విచారణ జరిపింది. అయితే కవిత అరెస్టు విషయంలో ఇప్పటి దాకా  సంయమనం పాటించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత అరెస్టుకు రంగం సిద్ధం చేశాయి. అయితే ఎలాంటి దర్యాప్తు జరపవద్దని సుప్రింకోర్టు ఇచ్చిన గడువు ముగిసినందునే తాము అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే కవిత అరెస్టు జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికార పీఠం కోల్పోవడం, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాష్ చేసుకొని అధికార పీఠం దక్కించుకోవడం, సీఎంగా రేవంత్ రెడ్డి పాలనలోనూ, రాజకీయంగా దూకుడుగా వెళ్తుండడంతో బీజేపీ కూడా ఆదే దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పై ప్రజలకున్న వ్యతిరేకతను అంచనా వేయడంలో కమలం పార్టీ విఫలమయినట్లు, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడుగా వెళ్లలేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. గత వంద రోజుల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలన్నది ఢిల్లీ పెద్దల ఆకాంక్షగా కమలం నేతలు చెబుతున్నారు. ఆ కార్యాచరణలో భాగంగానే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బీజేపీ - బీఆర్ఎస్ ల మధ్య ఎలాంటి బంధం లేదని రుజువు చేసుకునే ప్రయత్నమే కవిత అరెస్టు అన్నది రాజకీయ వర్గాల నుంచి వినవస్తోన్న మాట. బీఆర్ఎస్ - బీఎస్పీ పొత్తు వల్ల  గులాబీ మళ్లీ వికసించకుండా ఉండేందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీఎస్పీ అధినేత్రి నుంచే ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. పొత్తు ప్రకటన వెలువడిన వెంటనే కేసీఆర్ బీఎస్పీకి హైదరాబాద్, నాగర కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసేలా, మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తారని గులాబీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో కమలం పార్టీనే తమ అధినేత్రిపై ఒత్తిడి తెచ్చి  రాష్ట్రంలో బీఆర్ఎస్ తో కలసి వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు చెబుతూ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ పరిణామం కూడా సరిగ్గా బీఆర్ఎస్, బీఎస్పీకి కేటాయించిన నాగర్ కర్నూల్ నియోజక వర్గంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగానే జరగడం మరో విశేషం.కవిత  అరెస్టు గాని, బీఎస్పీతో పొత్తు విచ్ఛిన్నం కాని ఈ రెండు పరిణామాలు బీజేపీకే లాభిస్తాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే వ్యతిరేకతను తాము ఉపయోగించుకొని తెలంగాణలో ప్రత్నామ్నాయ శక్తిగా ఎదగాలన్నది కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు. బీఆర్ఎస్ ను ఖతం చేస్తే  అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలే మనుగడలో ఉంటాయి. అందుకోసం ఇప్పటి వరకు బీజేపీ- బీఆర్ఎస్ ల మధ్య దోస్తీ ఉందన్న ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి. అలా వేయాలంటే కవిత అరెస్టు ద్వారా తమ చిత్తశుధ్ధిని నిరూపించుకోవచ్చన్నది బీజేపీ నేతల వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్ ఏ మాత్రం బలపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మద్ధతు ఉంటే బీఎస్పీ లాంటి పార్టీతో జట్టుకట్టడం కూడా ముఖ్యమని అందుకే ఢిల్లీ నుంచే ఈ పొత్తు విచ్ఛిన్నం చేసే ప్లాన్ సాగినట్లుందని అందుకే ఆర్ఎస్పీ రాజీనామా అని చెబుతున్నారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ- సీఎం రేవంత్ రెడ్డిల మొదటి సమావేశంలోనే ఈ ప్లాన్ కు బీజం పడిందా అంటే.. అవుననే రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆ సమావేశంలోనే రెండు జాతీయ పార్టీలు తప్ప ప్రాంతీయ పార్టీలు ఉండటం సరి కాదన్న భావనలో ఇప్పటికే ఉన్న ప్రధాని మోదీతో ఆ సమావేశంలో అదే అభిప్రాయం రేవంత్ వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ ను ఖాళీ చేసే ప్రక్రియ స్టార్ అయిందని, అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరిగా చేర్చుకుంటున్నాయని విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ ను ఖాళీ చేసే వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు పరిణామాలు చూడవచ్చని చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం కేసీఆర్ కు తలకు మించిన పనే అవుతుంది. ఇప్పటికే ఒక్కక్కరుగా నేతలు కాంగ్రెస్, బీజేపీల చెంత చెరుతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఆశించే స్థాయిలో సీట్లు రాకపోతే రానున్న ఐదేళ్ల పాటు పార్టీ మనుగడ అత్యంత ప్రమాదకర పరిస్థితిలో పడటం ఖాయమని గులాబీ నేతలే తమ అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉండనుంది.. కేసీఆర్ ఏం చేయనున్నారు అన్నది మాత్రం మనం వేచి చూడాల్సిందే.

Related Posts