విజయవాడ, మార్చి 19
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఓ వైపు ప్రతిపక్షాలు కూటమి కడితే… మరోవైపు సింగిల్‌గా, పక్కా ప్రణాళికతో జనాల్లోకి వెళ్తున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్. ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నారు వైసీపీ బాస్.దేశంలోనే బెస్ట్ సీఎం అవుతా… రాష్ట్రానికి 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇవి జగన్ అధికారం చేపట్టినప్పుడు చెప్పిన మాటలు. ఇప్పుడు ఐదేళ్ల పాలన తర్వాత జగన్ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. దీంతో వైసీపీకి ఈ ఎలక్షన్లు అత్యంత కీలకంగా మారాయి. ఐదేళ్ల పాలన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇది పరీక్షా కాలంగా వైసీపీ భావిస్తోంది.ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి ఎన్నికల మ్యానిఫెస్టో అమలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు జగన్. మ్యానిఫెస్టో 99 శాతం అమలు చేశామని తెలిపారు. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని చేసినందుకే ఈసారి 175 టార్గెట్ పెట్టుకుని రంగంలోకి దిగుతున్నట్లు జగన్ చెబుతున్నారు.ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలుకావడంతో సీఎం జగన్ ప్రచార పర్వానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే సిద్ధం సభలతో ప్రాంతాల వారీగా పర్యటించిన జగన్… ఎన్నికల క్యాంపెయిన్ ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే బహిరంగసభలతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్‌లో జోష్ నింపిన జగన్… ఇప్పుడు మరింత స్పీడుగా జనాల్లోకి వెళ్లనున్నారుఎన్నికల క్యాంపెయిన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని రోజులు పర్యటించాలి. ఏ జిల్లాలో ఎప్పుడు పర్యటించాలి, సభలు ఎక్కడ నిర్వహించాలి, రోడ్ షోలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై పార్టీ పక్కా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి 151 నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీ… ఇప్పుడు వై నాట్ 175 నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. 2019 విజయాన్ని రిపీట్ చేయాలని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగానే ప్రచారాన్ని ఉధృతం చేస్తూ రోడ్ షోలు, సభలతో విస్తృతంగా ప్రజలకు దగ్గరయ్యేలా షెడ్యూల్ ఫిక్స్ చేయనుంది.వై నాట్ 175 నినాదాన్ని బలంగా తీసుకొని వెళ్లడంతో పాటు.. ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించనున్నారు వైసీపీ నేతలు. జగన్ సింగిల్‌గా సిద్ధం అంటుంటే… ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా మారి వైసీపీపై యుద్ధానికి దిగుతున్నాయి. ఓ వైపు చంద్రబాబు, మరో వైపు పవన్‌తోపాటు బీజేపీ కూటమిలో ఉండడంతో ఎన్నికలు పోటాపోటీగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జగన్‌కు మరింత కీలకంగా మారాయి. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి.