ఒంగోలు మార్చి 19
అనుకున్నట్టే అయ్యింది. వాలంటీర్లకు జగన్ దెబ్బ తగిలింది. వారి ఉనికి ప్రశ్నార్ధకం కానుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వలంటీర్లపై చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లపై దాడులు పెరుగుతున్నాయి. ఎక్కడికక్కడే వారిని టిడిపి,జనసేన శ్రేణులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. కడప జిల్లాలో అయితే వలంటీర్ పై దాడి జరిగింది. ఇంటింటికి వెళ్లి వైసిపి కరపత్రాలు అందించడమే కారణం. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని నియమించారు. సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలు పారదర్శకంగా అందించేందుకు వలంటీర్ల నియామకం చేపట్టినట్లు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ఇలా నియమితులైన వారందరూ వైసీపీ సానుభూతిపరులే. ఈ వాలంటీర్ వ్యవస్థ మూలంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. పేరుకే అది వ్యవస్థ కానీ.. అది వైసిపి సైన్యంగా పనిచేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ తోనే మరోసారి అధికారంలోకి వస్తానని జగన్ ధీమాతో ఉన్నారు. అయితే వారిని ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించాల్సింది పోయి.. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచిపెట్టే కార్యక్రమాన్ని అప్పగించారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని.. లేకుంటే నిలిచిపోతాయని కరపత్రాల్లో పొందుపరిచారు. వాటిని తమ పరిధిలోని 50 కుటుంబాలకు అందించే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు. అయితే ఇప్పుడు వాలంటీర్ల పై కత్తి వేలాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయి. టిడిపి, బిజెపి, జనసేన ఉమ్మడి సభ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ సర్కార్ పై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రులపై అవినీతి ఆరోపణలు చేశారు. వైసిపి విషయంలో కఠినంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. దీంతో రాష్ట్రంలో మూడు పార్టీల శ్రేణులు జగన్ కు సహకారం అందించే వ్యవస్థలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. అందులో భాగంగా వాలంటీర్ వ్యవస్థపై విరుచుకు పడే ఛాన్స్ కనిపిస్తోంది. 5000 రూపాయల వేతనంతో వాలంటీర్ ఇప్పటివరకు పని చేస్తూ వస్తున్నారు. వారు వైసిపి సానుభూతిపరులే అయినా.. రాజకీయాలు చేసినా .. ఇన్ని రోజులు చెల్లుబాటు అయ్యింది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు. వాలంటీర్ల పై కేసులు, దాడులు పెరిగే ఛాన్స్ ఉంది. దీనికి ముమ్మాటికీ జగనే కారణం. వాలంటీర్ వ్యవస్థను రాజకీయంగా వినియోగించుకోవాలన్న ప్రయత్నం ఎన్నికల ముంగిట ఎన్నెన్నో ఇబ్బందులను తెచ్చే పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.