రానున్న ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత అటుంచితే, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత మాత్రం తెలుగుదేశం పార్టీ కొంప ముంచేటట్లే ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వరుస ఆరోపణలు వస్తుండటంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బండా ఉమాపై వరుసగా ఆరోపణలు వస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలలో ఎవరిపై రానన్ని ఆరోపణలు బోండా ఉమపై వచ్చాయి. ఇందులో ఎక్కువగా భూవివాదాలు, బెదిరింపులకు సంబంధించినవే. వీటిపై ఒక సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోండా ఉమకు క్లాస్ తీసుకున్నారు. అయినా బోండా ఉమపై ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. ఎమ్మెల్యేలను కట్టడి చేయాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం వరుస ఆరోపణలు ఎదుర్కొంటున్న బోండా ఉమపై చర్యలు తీసుకోకుండా టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం ఇవ్వడం సరికాదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. బోండా ఉమపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే మాగంటి బాబుతో తనకు గానీ, టీడీపీకి గానీ ఎటువంటి సంబంధం లేదని బోండా ఉమ అంటున్నారు. రాజధాని ప్రాంతంలోనే ఇలా ఎమ్మెల్యేలపై భూవివాదాలకు సంబంధించిన ఆరోపణలు రావడం పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే పవన్ ఆరోపణలతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీకి బోండా మీద మరో వివాదం తలెత్తడం పార్టీకి, అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. బొండా ఉమ పై పలు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ స్వతంత్ర్య సమరయోధుడి భూమిని కబ్జా చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు గతంలో వచ్చాయి. అనంతరం ఇద్దరు మహిళలకు చెందిన 86 సెంట్ల భూమిని కాజేసేందుకు ప్రయత్నించారని బాధితులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. కేవలం బొండా ఉమనే కాదు, ఆయన భార్యపై కూడా ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఇక తాజాగా, మరో భూవివాదంలో బొండా పేరు వినిపిస్తోంది. విజయవాడలోని సుబ్బరాయనగర్ లో స్థలం అమ్ముతామని చెప్పి బోండా అనుచరులు మాగంటి బాబు, వాసు, వర్మ అనే వ్యక్తులు నందిగామకు చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి వద్ద నుంచి రూ.35 లక్షలు తీసుకున్నారు. ఇక స్థలం రిజిస్ట్రేషన్ చేయించాలని లేదా డబ్బులైనా తిరిగి ఇవ్వాలని అడిగితే ఎమ్మెల్యే బోండా ఉమ పేరు చెప్పి బెదిరిస్తున్నారని సుబ్రమణ్యం ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన బోండా ఉమతో పాటు అనుచరులపై నగర పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.