YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రణీత్ రావు కు బిగిస్తున్న ఉచ్చు

ప్రణీత్ రావు కు బిగిస్తున్న ఉచ్చు

హైదరాబాద్, మార్చి 21
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్ కాల్స్ విన్నారని.. ఇందుకోసం ప్రత్యేకంగా వార్ రూమ్స్ ఏర్పాటు చేశారని.. ఆరోపణలు ఎదుర్కొంటూ.. పోలీసుల విచారణలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో ప్రతిరోజు కొత్త విషయం తెలుస్తోంది. ప్రతిపక్ష నాయకుల ఫోన్ కాల్స్ వినడంలో ఆయన అధునాతన సాఫ్ట్ వేర్ ఉపయోగించారని.. దీనికి అప్పటి ప్రభుత్వ పెద్దలు సహకరించారని.. ముఖ్యంగా ఇంటలిజెన్స్ లో పనిచేసే ఒక కీలక అధికారి ప్రణీత్ రావుకు అండదండలు అందించారని ప్రచారం జరుగుతోంది. పోలీసుల విచారణలో అనేక కీలక నిజాలు వెలుగుచూస్తున్నాయి.ఎస్ఐబీలోని లాగిన్ రూమ్, స్పెషల్ ఆపరేషన్ బృందంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. వాటిని వికారాబాద్ అడవుల్లో పడేశారు. అయితే ఆ పరికరాల కోసం ప్రస్తుతం ఒక ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చేస్తోంది. ఆ హార్డ్ డిస్క్ లలోనే ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసిన ప్రతిపక్ష నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర ప్రముఖుల సమాచారం ఉందని తెలుస్తోంది. వాటిని ధ్వంసం చేయడం ద్వారా ఆధారాలు దొరకకుండా చేసేందుకు ప్రణీత్ రావు ప్రయత్నించాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక గత ప్రభుత్వంలో ఓ సీనియర్ నాయకుడు చక్రం తిప్పాడని,ప్రణీత్ రావుకు అతడు అన్ని రకాలుగా అండదండలు అందించాడని ప్రచారం జరుగుతోంది. విచారణలో ఆ సీనియర్ నాయకుడి పాత్రను ప్రణీత్ రావు బయట పెట్టాడని తెలుస్తోంది. మీడియా ద్వారా ఈ విషయం బయటికి పొక్కడంతో సదరు నాయకుడు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి తనకు, ప్రణీత్ రావుకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. అయితే ప్రణీత్ రావు సిరిసిల్ల, వరంగల్, హైదరాబాదులోని ఓ మీడియా సంస్థ యజమాని ఇంట్లో సర్వర్లు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది. అంతేకాదు తాను ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేశాడో ఒక డైరీలో ప్రణీత్ రావు రాసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ డైరీలో కొన్ని వందల సంఖ్యల్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయని.. వాటన్నింటినీ ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశాడని అధికారులు భావిస్తున్నారు. ఆ నెంబర్లలో అప్పటి అధికారపక్షం టార్గెట్ చేసిన ప్రతిపక్షాల నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర ప్రముఖులవి ఉన్నవి. అందులో కొందరు సినిమా రంగానికి చెందిన వారు కూడా ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఆ మీడియా యజమాని కోరిక మేరకు ప్రణీత్ రావు మరికొందరు నెంబర్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది.అయితే ఈ వ్యవహారాన్ని ప్రణీత్ రావు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ప్రారంభించినట్టు సమాచారం. ఇంటెలిజెన్స్ లో కీలక అధికారితో పాటు మరికొంతమంది ఇన్ స్పెక్టర్లు ప్రణీత్ కు సహకరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వారిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ తీసుకొచ్చి వాడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే విదేశాల నుంచి దానిని తెప్పించింది ఎవరనే విషయాన్ని ప్రణీత్ రావు పోలీసుల ఎదుట పేర్కొన్నట్టు సమాచారం. అయితే అది పెగాసస్ సాఫ్ట్ వేరా? అంతకు మించిన ఆధునికమైనదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇవన్నీ వివరాలు చెప్పిన తర్వాత.. హార్డ్ డిస్కులు ధ్వంసం చేశానని ఒప్పుకున్న తర్వాత.. తన అరెస్టు అక్రమమని ప్రణీత్ రావు కోర్టులో తన న్యాయవాదుల ద్వారా ఫిర్యాదు చేయడం కొసమెరుపు.

Related Posts