YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బెజవాడలో అన్నదమ్ముల సవాల్

బెజవాడలో అన్నదమ్ముల సవాల్

విజయవాడ, మార్చి 22,
ఇంటి పేరు కేశినేని.. కాని కసినేని అని మార్చుకుంటే బెటర్‌గా ఉంటుందేమో.. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు మాత్రమే కాదు రాజకీయ విభేదాలు కూడా తీవ్రంగా ఉంటాయని ఈ బెజవాడ బ్రదర్స్ ను చూస్తేనే అర్థమవుతుంది. ఇద్దరూ ఒకే పార్టీలో మొన్నటి వరకూ ఉన్నారు. కానీ ఇప్పుడు వేర్వేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా బ్రదర్స్ బరిలోకి దిగుతున్నారు. వారే కేశినేని బ్రదర్స్. కేశినేని నాని... కేశినేని చిన్ని.. ఈ ఇద్దరు పేర్లు వేర్లు వేరయినా బెజవాడలో ఫేమస్ గా వినిపించే పేర్లు మాత్రం ఇవే. ఇద్దరూ మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ నేడు ఒకరు వైసీపీ అభ్యర్థిగా, మరొకరు టీడీపీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంటు బరిలో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు.  కేశినేని ట్రావెల్స్ అంటే రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఇప్పుడు అనేక ట్రావెల్స్ సంస్థలు వచ్చాయి. కానీ 1990వ దశకం నుంచే కేశినేని ట్రావెల్స్ అంటే అందరికీ సుపరిచితమే. ఏసీ బస్సుల నుంచి స్లీపర్ కోచ్ ల వరకూ తొలుత ప్రవేశపెట్టి బెజవాడ మార్క్ ఇదీ అని ట్రాన్స్‌పోర్టు రంగంలోనూ వీళ్లు సత్తా చాటారు. అయితే ఆ వ్యాపారాన్ని చేస్తూనే కేశినేని నాని తొలుత ప్రజారాజ్యం ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో మూడు స్థానాలు మాత్రమే టీడీపీ గెలిస్తే అందులో విజయవాడ పార్లమెంటు మాత్రం ఒకటిగా నిలబెట్టింది కేశినేని నాని.. కేశినేని చిన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ హైదరాబాద్ లో రెండు చేతులా బాగానే సంపాదించారంటారు. ఆయన పేరు 2021 తర్వాతనే బెజవాడ రాజకీయాల్లో వినిపించింది. అప్పుడే కేశినేని నాని స్థానంలో ఆయన సోదరుడు చిన్నికి టీడీపీ టిక్కెట్ ను 2024 లో ఇస్తున్నారన్నది కన్ఫర్మ్ అయింది. అప్పటి నుంచి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో కేశినేని నానికి వ్యతిరేకంగా ఉండేవారిని కూడగట్టి నారా లోకేష్‌కు దగ్గరై పార్టీలో పాతుకు పోయారు. చివరకు పార్టీ ఆయన వైపే మొగ్గు చూపింది. దీంతో కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి విజయవాడ టిక్కెట్‌ను సాధించుకున్నారు. తనను ఓడించాలంటే చంద్రబాబు కూడా సరిపోడన్న ధీమాలో కేశినేని నాని ఉన్నారు.కేశినేని చిన్ని పేరును ఇంకా టీడీపీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయనే అభ్యర్థి. సో.. ఇద్దరు అన్నదమ్ముల మధ్య యుద్ధం మాత్రం ఈసారి ఆసక్తికరంగా సాగనుంది. పదేళ్లు పార్లమెంటు సభ్యుడిగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న కేశినేని నానికి వైసీపీ ఓటు బ్యాంకు అదనపు బలంగా మారనుంది. అదే సమయంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉండటంతో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో కేశినేని చిన్ని ఫుల్ ఖుషీగా ఉన్నారు. మొత్తం మీద ఇద్దరు బెజవాడ బ్రదర్స్ మధ్య పోటీ మాత్రం రాష్ట్రంలోనే ఆసక్తికరంగా మారింది. ఎవరు గెలుస్తారన్న దానిపై తీవ్రస్థాయిలో బెట్టింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయంటున్నారు.

Related Posts