YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల బరిలో సీఎంల వారసులు

ఎన్నికల బరిలో సీఎంల వారసులు

విజయవాడ, మార్చి 22 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుండగా...అదే రోజు నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. మే 13న పోలింగ్ జరగనుండగా...జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో 543పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పలు నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఏకంగా ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల తనయులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరో ఇద్దరు వారసులు లోక్ సభకు పోటీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో...అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి ఎనిమిది ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి అరుదైన సంఘటన ఎప్పుడు జరగలేదు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు చరిత్రలో నిలిచిపోనున్నాయి.  అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ కు పోటీ చేస్తున్న వారసులంతా...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పని చేసేవారే ఉన్నారు. ఎన్టీఆర్ మూడు సార్లు, చంద్రబాబునాయుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు చొప్పున...ఉమ్మడి ఏపీ సీఎంలుగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఎన్టీఆర్ వారసులు నందమూరి బాలక్రిష్ణ , దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. బాలక్రిష్ణ హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు విజయం సాధించారు. అటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 2004, 2009 ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నికైన పురందేశ్వరి...కేంద్ర మంత్రిగానూ పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్  మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆళ్ల రామక్రిష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయినా...మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ హయాంలో లోకేశ్ మంత్రిగానూ పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులు...వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల రెడ్డి...ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచిచేసిన గెలుపొందిన జగన్మోహన్ రెడ్డి...విభజిత ఆంధ్రప్రదేశ్ కు రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్... మరోసారి అక్కడి నుంచి పోటీ చేయనున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి...కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. షర్మిల రెడ్డి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మరోవైపు  మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. ఉమ్మడి ఏపీకి రెండు సార్లు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా పని చేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడే జయసూర్యప్రకాశ్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. గతంలో ఎంపీగా పని చేసిన ఆయన ఈ సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. 1992లో ఏపీ సీఎంగా పని చేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి...నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్...గుంటూరు జిల్లా తెనాలి నుంచి జనసేన తరపున బరిలోకి దిగుతున్నారు. నాదెండ్ల మనోహర్...2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గానూ పని చేసిన అనుభవం ఉంది.

Related Posts