కాకినాడ, మార్చి 22
పిఠాపురంపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం జగన్ తో ముద్రగడ పద్మనాభం, వంగా గీత భేటీ అయ్యారు. సీఎం జగన్ సమక్షంలో పిఠాపురంలోని పలువురు నేతలు వైసీపీలో చేరారు. ఇప్పటికే పిఠాపురంపై ఫోకస్ పెట్టాలని మంత్రులను ఆదేశించారు సీఎం జగన్. పిఠాపురంలో మండలాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో.. వైసీపీ ఆ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పవన్ కల్యాణ్ పై విజయం సాధించాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. వంగా గీతకు పూర్తి స్థాయిలో మద్దతించేందుకు కీలక నేతలు అందరికీ సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు.పిఠాపురం ఇంఛార్జిగా మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్.. ఇక మండలాల వారీగా కూడా ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు ఇచ్చారు. గొల్లప్రోలు మండలానికి సంబంధించి మాజీ మంత్రి కన్నబాబును ఇంఛార్జిగా నియమించారు. యు కొత్తపల్లికి దాడిశెట్టి రాజాను ఇంఛార్జిగా నియమించారు. ఇక, పిఠాపురం టౌన్ కి సంబంధించి మిథున్ రెడ్డి ఇంఛార్జిగా ఉన్నారు. మరో ఇద్దరు నేతలు ముద్రగడ పద్మనాభంతో పాటు ద్వారంపూడి చంద్రశేఖర్ కి కీలక బాధ్యతలు అప్పగించారు జగన్.అటు వంగా గీత, ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం, ఎన్నికల వ్యూహం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి సీఎం జగన్ తో వారు చర్చించినట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేనలోని ప్రజాకర్షక, బలమైన నేతలందరినీ కూడా వైసీపీలోకి తీసుకొచ్చే వ్యూహం అమలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇప్పటికే జనసేన పార్టీ ఇంఛార్జిగా ఉన్న, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన శేషు కుమారిని ఇప్పటికే వైసీపీలో చేర్చుకున్నారు.