ఏలూరు, మార్చి 22
రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ అధిష్టానాన్ని రెబల్ అభ్యర్థుల బెడద వేదిస్తోంది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ఆ నియోజకవర్గంలో పోటీకి టీడీపీకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు టీడీపీ రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన పలు నియోజకవర్గంలో టికెట్ దక్కని ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్నిసైతం ఆయన ప్రారంభించారు.ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి లిస్ట్ లో మంతెన రామరాజుకు టికెట్ కేటాయించారు. రామరాజుకు టికెట్ ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వ్యతిరేకిస్తున్నారు. 20సంవత్సరాలుగా పార్టీకోసం కష్టపడి పనిచేస్తున్నానని, తనకే ఉండి నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని శివరామరాజు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆయన సిద్ధమై ప్రచారాన్నికూడా ప్రారంభించారు. కాళ్ల మండలం నుంచి ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు.శివరామరాజు మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లా ఉండితో నాకు విడదీయరాని అనుబంధం ఉందని, 20 సంవత్సరాలుగా పార్టీకోసం కష్టపడుతున్నానని అన్నారు. ఉండి ప్రజలు 2009, 2014 ఎన్నికల్లో ఎనలేని ఆదరణ నాకు చూపారని, ఉండి ప్రజల నుంచి నాకు అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పారు. 2019లో అధిష్టానం నిర్ణయం మేరకు నరసాపురం ఎంపీగా పోటీచేయాల్సి వచ్చిందని, మళ్లీ ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అధిష్టానానికి తెలియజేసినా పట్టించుకోలేదని శివరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఒక్కమాటకూడా చెప్పకుండా ఉండి నియోజకవర్గం సీటు రామరాజుకు కేటాయించారని, నాకు ఆ విషయం చాలా బాధ కలిగిందని అన్నారు. ఉండి ప్రజల నిర్ణయం మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు శివరామరాజు చెప్పారు. ఉండిలోనే ఉంటూ, నియోజకవర్గం ప్రజల అభివృద్ధికోసం పాటుపడతానని, రైతులకు బిడ్డగా మహిళలకు అన్నగా ఉంటానని, మరోసారి నన్ను ఉండి నియోజకవర్గం నుంచి గెలిపించాలని శివరామరాజు నియోజకవర్గం ప్రజలను కోరుతున్నారు