YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పదవిలో ఉండి అరెస్టైన ఫస్ట్ సీఎం

పదవిలో ఉండి అరెస్టైన ఫస్ట్ సీఎం

న్యూఢిల్లీ, మార్చి 22,
ఢిల్లీ మద్యం పాలసీ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పదవిలో ఉండగా అరెస్టయిన తొలి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన అరెస్ట్‌తో ఆప్ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. అయితే, అరెస్టయినా ఆయనే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ ప్రకటించింది.ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొద్ది గంటలకే కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తొమ్మిదిసార్లు ఈడీ సమన్లు జారీచేసినా... ఆయన హాజరుకాలేదు. మనీల్యాండరింగ్ కేసులో ఇటీవల ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, తన రాజీనామాను గవర్నర్ ఆమోదించే వరకూ అరెస్ట్ మెమోపై ఆయన సంతకం చేయలేదు. అరెస్ట్‌‌కు ముందు ఆయన రాజీనామా చేసి.. తన వారసుడిగా చంపై సోరెన్‌కు పగ్గాలు అప్పగించారు. పదవి నుంచి తప్పుకున్న తర్వాత అరెస్టైన ముఖ్యమంత్రుల జాబితాలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మొదలు ఓం ప్రకాశ్‌ చౌతాలా (హరియాణా), మధు కోడా (ఝార్ఖండ్‌), హేమంత్‌ సోరెన్‌ (ఝార్ఖండ్‌) వంటి నేతలు ఉన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్:
బిహార్ ముఖ్యమంత్రిగా 1990-1997 మధ్యకాలంలో పనిచేసిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌‌ దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలింది. ఆర్జేడీ అధినేతతోపాటు మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రాలకు 2013లో జైలు శిక్ష ఖరారయ్యింది. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన.. బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు లాలూను వెంటాడుతోంది.
జయలలిత:
 అక్రమాస్తుల కేసులో తమిళనాడు దివంగత సీఎం జయలలిత అరెస్టయి జైలుకెళ్లారు. 1991-2016 మధ్యకాలంలో పలుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయ.. కలర్‌ టీవీల కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన కేసులో డిసెంబరు 7, 1996లో ఆమె అరెస్టయ్యారు. అప్పుడు నెల రోజుల పాటు జైలులో ఉండగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014లో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. దీంతో మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సందర్భాల్లో ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
ఓంప్రకాశ్‌ చౌతాలా:
1989-2005 మధ్య హరియాణా ముఖ్యమంత్రిగా పలుసార్లు పనిచేసిన ఓంప్రకాశ్ చౌతాలా.. ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఆయనను హైకోర్టు 2013లో దోషిగా నిర్దారించి పదేళ్ల శిక్ష వేసింది. తర్వాత అక్రమాస్తుల కేసులో 2022లో కోర్టు ఆయనకు మరో నాలుగేళ్లు శిక్ష విధించింది.
మధు కోడా:
2006-2008 మధ్య ఝార్ఖండ్ సీఎంగా పనిచేసిన మధు కోడా.. బొగ్గు కుంభకోణం కేసులో 2009లో అరెస్టయ్యారు. కోడా సైతం కేజ్రీవాల్ మాదిరిగానే ఈడీ పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణ నిమిత్తం హాజరు కాలేదు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత విచారణకు హాజరవుతానని వివరణ ఇచ్చారు. అయితే, చాయ్ బసా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
హేమంత్‌ సోరెన్‌:
2013-2024 మధ్య కాలంలో ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ పనిచేశారు. గనులు కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఈఏడాది జనవరి 31న అరెస్టయ్యారు. అంతకుముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో జేఎంఎం సీనియర్‌ నేత, చంపయీ సోరెన్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.

Related Posts