YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కవిత స్టేట్మెంట్లే... అరవింద్ కొంప ముంచాయి

కవిత  స్టేట్మెంట్లే... అరవింద్ కొంప ముంచాయి

న్యూఢిల్లీ, మార్చి 22,
కొద్దిరోజుల పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది. ఇంకేముంది రాజకీయ పైరవీలతో కేసును నీరు గార్చారని.. నిందితులు మొత్తం సేఫ్ అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పట్లో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, అభిషేక్, బుచ్చిబాబు వంటి వారంతా అప్రూవర్లుగా మారారని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రకటించారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా కవితను పలు మార్లు విచారించారు. తర్వాత ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. నళిని చిదంబరం కేసును ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు కూడా కవితకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో.. ఈడీ సైలెంట్ అయిపోయింది. ఆలోగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోవడంతో ఈడీ రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ కేసును తవ్వడం మొదలుపెట్టింది. చడిచప్పుడు లేకుండా హైదరాబాద్ వచ్చింది. కవిత ఇంట్లోకి సైలెంట్ గా వెళ్లిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించడంతో.. కవితను అరెస్టు చేసి తీసుకెళ్లింది. కవితను కోర్టులో హాజరు పరిచి.. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంది. గత కొద్దిరోజులుగా ఆమెను విచారిస్తోంది. తన అరెస్టు అక్రమమంటూ కవిత పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. ఆమెను జైలు నుంచి విడుదల చేయించేందుకు కేటీఆర్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. కపిల్ సిబాల్ లాంటి న్యాయ కోవిదులు ఈ కేసును విచారిస్తున్నప్పటికీ కవితకి ఉపశమనం లభించడం లేదు. మరోవైపు విచారణలో కవిత ఏం చెబుతున్నారనే విషయాలను ఈడీ గోప్యంగా ఉంచుతోంది. సాధారణంగా ఇలాంటి విచారణ సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మీడియాకు లీకులు ఇస్తారు. కానీ కవిత విచారణలో అలాంటివేవీ చేయడం లేదు. మనీలాండరింగ్ కేసులో ఆమెను అరెస్టు చేసిన నేపథ్యంలో.. ఇప్పట్లో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు లేవని చర్చ జరుగుతున్నది. మరోవైపు విచారణలో కవిత చెప్పిన వివరాల ఆధారంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టు జరిగిందని తెలుస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించకపోవడం.. కేసులో తాము తల దూర్చలేమని కోర్టు చెప్పడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు. పైగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల పనితీరును విమర్శించారు. ఆ విభాగానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎన్ ఫోర్స్ అధికారులు వెనకడుగు వేయలేదు. అత్యంత పకడ్బందీగానే అరవింద్ ను అరెస్టు చేశారు. వాస్తవానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలంటే చాలా వరకు బందోబస్తు ఏర్పాటు చేయాలి. కానీ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పూర్తిగా కేంద్ర బలగాల సహాయంతో అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. వారు భద్రత కల్పిస్తుండగా రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. అరవింద్ కేజ్రివాల్ ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.. అనంతరం ఆయనను జైలుకు తరలించారు. కాకపోతే ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మనదేశంలో ఒక కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడం ఇదే మొదటిసారి.కాగా, అరవింద్ ను అరెస్టు చేసిన నేపథ్యంలో.. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవా రాష్ట్రాలలో అల్లర్లు చెలరేగకుండా కేంద్ర భద్రతా దళాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి.

Related Posts