పల్నాడు
చిలకలూరి పేట ప్రజా గళం లో ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైప్రొటోకాల్ తో ఏర్పాట్లు చేయాల్సి ఉండగా.. పల్నాడు జిల్లా పోలీసులు లైట్ తీసుకోవడం, దీంతో సభలో ప్రధాని మోడీ స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్దితులు రావడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాలతో ఎన్డీయే కూటమి నేతలు నిన్న ఈసీకి ఫిర్యాదు చేశారు. పల్నాడు సభలో శాంతి భద్రతల నియంత్రణలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ప్రధాని సభకు గుంటూరు రేంజ్ కు చెందిన ఇద్దరు ఎస్పీలతో పాటు విశాఖ రేంజ్ లో మరో ఎస్పీకి కూడా బాధ్యతలు అప్పగించారు. కానీ సభ జరుగుతున్న సమయంలో బాటిళ్లు గ్యాలరీల్లోకి విసరడం, లైట్ టవర్స్ ఎక్కేయడం, మైక్ సెట్ పైకి జనం దూసుకురావడం, ప్రధాని ఉన్న సమయంలోనే జనం వేదికపైకి వచ్చేయడం వంటి అంశాలపై కేంద్ర నిఘా సంస్ధలు నివేదిక ఇచ్చాయి. వీటిపై ఇప్పుడు ఈసీ తదుపరి చర్యలకు సిద్దమవుతోంది. ప్రధాని సభకు తగిన ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయకపోవడం, భారీ ఎత్తున జనం వస్తారని తెలిసినా వారిని నియంత్రించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోకపోవడం, ప్రధాని మోడీ నేరుగా జోక్యం చేసుకుని హెచ్చరిస్తున్నా జనం లైటింగ్ టవర్స్, మైక్ సెట్ ల నుంచి దూరంగా వెళ్లకపోవడం వంటి పరిణామాల్ని తీవ్ర భద్రతా లోపాలుగానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.