YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పవర్ చూపిస్తున్న పోలీసులు

పవర్ చూపిస్తున్న పోలీసులు

హైదరాబాద్, మార్చి 22,
లోక్‌సభ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అయా పోలీస్ స్టేషన్ల ఇన్‌‌స్పెక్టర్లను ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. రౌడీ షీటర్ల బైండోవర్‌ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ జోన్, సౌత్ ఈస్ట్, వెస్ట్ జోన్ పరిధిలో ఎక్కువ మంది రౌడీషీటర్లు ఉన్నట్లు రికార్డు చెబుతున్నాయి. పోలీస్ స్టేషన్ల వారీగా వాళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఏసీపీ, ఇన్స్‌పెక్టర్లకు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలిచ్చారు. కొంతమందిని రౌడీషీటర్లను తహసీల్దార్, ఆర్డీవోల వద్ద బైండోవర్ చేయాలని సూచించారు.ముందస్తుగా రౌడీ షీటర్లు, పాత నేరస్థులు, కమ్యూనల్ అఫెండర్స్‌పై నిఘా పెట్టారు తెలంగాణ పోలీసులు. నేరాలకు పాల్పడకుండా రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వాళ్ల కదలికలపై ఆరా తీస్తున్నారు.ముఖ్యంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. ఎన్నికల్లో ఎలాంటి గొడవలు చేయకుండా వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. కొన్ని కేసుల్లో కనిపించకుండా పోయిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. మరికొంతమంది ఇంటికి నేరుగా వెళ్లి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది పాత నేరస్థులు పోలీసుల హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా పలువురిని బెదిరించినట్లు గుర్తించిన పోలీసులు వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారనే అనుమానం ఉన్న వాళ్లను బైండోవర్ చేస్తున్నారు పోలీసులు. మూడు పోలీసు కమిషనరేట్‌ పరిధిలో దాదాపు 3వేల 5వందల మంది రౌడీషీటర్లు రికార్డుల్లో నమోదయ్యారు. వీరితో పాటు వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్లపైనా పోలీసులు నిఘా పెట్టారు. హైదరాబాద్ మహానగరంతోపాటు సిటీ శివారు ప్రాంతాల్లో ప్రైవేటు దందాలు, రియల్‌ ఎస్టేట్ వ్యాపారం, హోటళ్లు, హవాలా, హత్యలు, బెదిరింపులకు పాల్పడుతున్న ఏ వన్‌ రౌడీ షీటర్లు వెయ్యి మంది వరకు ఉన్నట్టు పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది.రౌడీ‌షీట్ ఉన్నవాళ్లు ఏం పని చేస్తున్నారు. ఎవరి దగ్గర చేస్తున్నారు. రోజువారి కదలికలపై నిత్యం మానటరింగ్ చేయాలని పోలీస్ కమిషనర్లు కింది స్థాయి అధికారులకు సూచించారు. ఇంకా కొందరు రౌడీ షీటర్లు ఇళ్లులు మార్చడంతో ప్రస్తుతం వాళ్లు ఎక్కడ ఉంటున్నారనే ఆరా తీయాలని ఆదేశించారు. మరోవైపు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న రౌడీషీటర్లపై పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా ఐదుగురు, సూరారంలో నలుగురు, ఎస్సార్ నగర్‌ లో నలుగురు, తుకారంగేట్‌‌లో నలుగురు, సైదాబాద్‌ లో ఇద్దరు, పేట్‌ బషీరాబాద్‌ లో ఇద్దరు, కంచన్‌ బాగ్‌ లో ఇద్దరు చొప్పున రౌడీషీటర్లు అజ్ఞాతంలో వెళ్ళిన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రస్తుతం వారంతా ఎక్కడున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. పోలీస్ రికార్డులను బట్టి.. రౌడీ షీటర్లపై ప్రతీ జోన్ లో డీసీపీ మానిటరింగ్ చేయనున్నారు.

Related Posts