పాట్నా, మార్చి 22
బీహార్‌లోని సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న నాలుగులైన్ల వంతెన శుక్రవారం (మార్చి 22) ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుపాల్ జిల్లాలోని మరీచా సమీపంలో భేజాచ బకౌర్ మధ్య కోసీ నదిపై భారీ వంతెనను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాణంలో ఉన్న ఈ వంతెన శుక్రవారం ఉదయం 7 గంటలకు బ్రిడ్జిలోని కొంత భాగం కూలిపోయింది. అప్పటికే నిర్మాణ పనులు జరుగుతుండటంతో శిథిలాల కింద పడి 30 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికుల ఆహాకారాలతో ఆ ప్రాంతం అంతా భయంకంగా మారింది.
సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గాయాలపాలైన తొమ్మిది మంది రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు సుపాల్ డీఎం కౌశల్ కుమార్ తెలిపారు. ఈ ఘనపై పోలీసులు కేసు నమోదుచేసిన దర్యాప్తు ప్రారంభించారు