YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప బరిలో ఫ్యామిలీ వార్

కడప బరిలో ఫ్యామిలీ వార్

కడప, మార్చి 23
ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలు ఎవరూ ఊహించని ములుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. రోజు రోజుకు కొత్త కొత్త పరిణామాలు జరుగుతున్నాయి . వైసీపీకి మొదటి నుంచి ఎవరూ బద్దలు కొట్టలేనంత కంచుకోటగా మారిన కడప జిల్లాలో ఈ సారి వారసత్వ పోరు కారణంగా వైఎస్ కుటుంబం రెండు వర్గాలుగా మారి ఎన్నికల్లోకి దిగడం ఖాయమయింది. ఈ కారణంగా రాజకీయాలు ఎటు వైపు టర్న్ అవుతాయోనన్న చర్చ రాష్ట్రమంతటా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింప చేసేందుకు కంకణం కట్టుకున్న షర్మిల.. కడప బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడంతో అసలైన సవాల్ ప్రారంభమయిందని అనుకోవచ్చు. కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పార్లమెంట్ సభ్యురాలుగా పోటీలోకి దిగనున్నారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కడప కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో షర్మిల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తాను ఎందుకు పోటీ చేయాలో, ఎందుకు పోటీ చేయకూడదో ఒక్క మాటలో చెప్పాలని వారిని కోరారు. నాయకులు పలు అంశాలపై మాట్లాడారు.  కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాల్సిన అవసరాన్ని నియోజకవర్గ నాయకులు చెప్పారు. ఎవరైనా  కొంత మంది పోటీ చేయాల్సిన అవసరం ఏముందని వ్యతిరేకిస్తే.. షర్మిల ఆలోచించేవారేమో కానీ.. అందరూ పోటీ చేయాలన్న అభిప్రాయానికే వచ్చారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్  కూడా కడప నుంచి పోటీ చేయాలని షర్మిలకు సూచించింది. షర్మిల ఇప్పటి వరకూ వేర్వేరు ఆలోచనలతో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అన్నదానిపై స్పష్టతకు రాలేదు. కానీ హైకమాండ్ .. ఆదేశించిన తర్వాత ఇక రంగంలోకి దిగాల్సిందేనని అనుకుంటున్నారు. కడప నాయకుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో అడుగులు ముందుకు వేయనున్నారు. అయితే వారి నుంచి అనుభవాలను పరిగణలోకి తీసుకున్న షర్మిల అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనతో పాటు పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించే క్రమంలో కడప పార్లమెంట్ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నట్లు ప్రకటించనున్నట్లుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిపై వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి  తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున  ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా వుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వైఎస్ఆర్ సీపీలోని పలువురు నాయకులు వ్యక్తం చేశారు. అయినా జగన్ మాత్రం  తమ్ముడైన అవినాష్ కు ఇవ్వకుండా ఉంటే ఎలాగనే వాదనను తెరపైకి తెచ్చారు. అవినాష్ రెడ్డి విషయంలో కడప నియోజకవర్గంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా ఏవీ బయటకు రావు. వైఎస్ కుటుంబం గతంలోలా ఏకతాటిపైకి లేదు. వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబంపై మెజార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఉన్నారని చెబుతారు. అయితే ఎన్నికల్లో కుటుంబమే ఓట్లు వేయదు కానీ ప్రజలు కూడా అవినాష్ రెడ్డి విషయంలో అసంతృప్తిగా ఉంటే మాత్రం.. అది వైసీపీకి ఇబ్బందికరం అవుతుంది. అయినా అవినాష్ రెడ్డి విషయంలో జగన్ మొదటి నుంచి పూర్తి సపోర్టుగా ఉన్నారు. ఆయనపై ఈగ వాలనీయడం లేదు. వైఎస్ సునీతతో  పాటు అందరూ అవినాష్ రెడ్డి వైపు వేలెత్తి చూపిస్తున్నా... ఆయనకేం సంబందం లేదని.. ఆయనపై నిందలు వేస్తున్న వారే హత్య చేయించి ఉండవచ్చని కూడా ఎదురుదాడి చేస్తున్నారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి షర్మిల అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో ఒకసారి గెలిచారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దూరం కావడం, కొత్త పార్టీ పెట్టడం వల్ల అసెంబ్లీకి పులివెందుల నుంచి పోటీ చేశారు. పులివెందులలో కానీ, కడప పార్లమెంట్లో కానీ, అసలు కడప జిల్లా నుంచి మొత్తంగా వైఎస్ కుటుంబానికి మంచి పట్టు ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్ షర్మిలకు మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా కుటుంబానికి షర్మిల దూరమయ్యారు. జగన్ తో పాటు వదిన భారతి వద్దకు కూడా ఇంతవరకు వెళ్లలేదు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తరువాత నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ఎప్పటికప్పుడు కలుస్తూ వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌లో కడప నుంచి చేరిన వారు ఎవరూ లేరు. కడప పార్లమెంట్ ను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోగలిగితే సీఎం వైఎస్ జగన్ తో పాటు అవినాష్ రెడ్డికి కూడా చెక్ పెట్టిన వారం అవుతామనే ఆలోచనలో షర్మిల ఉన్నారు. షర్మిల.. కడపలో అవినాష్ రెడ్డి మీద  పోటీ చేస్తే.. ఖచ్చితంగా ఎన్నికల అంశంగా వైఎస్ వివేకా  హత్య కేసు మారుతుంది. ఇప్పటికే షర్మిల .. తాను సునీతకు అండగా ఉంటానని ప్రకటించారు. ఆమె కోసం చివరి వరకూ నిలబడతానని వర్థంతి సభలో ఎమోషనల్ గా హామీ ిచ్చారు. ఈ క్రమంలో వారి తరపున  షర్మిలనే నిలబడినట్లు అవుతుంది. వారు కూడా ప్రచారం చేస్తారు. ఈ క్రమంలో హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డినా.. తండ్రిని  కోల్పోయి న్యాయం కోసం పోరాడుతున్న  సునీత కోసం బరిలో నిలబడిన షర్మిలనా అన్న ప్రశ్న వస్తుంది. ఈ అంశం ఒక్క కడపలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఈ ఇద్దరి మధ్య పోటీ జరిగితే అదే అంశంపై ఓటింగ్ జరుగుతుంది. అప్పుడు టీడీపీ పోటీ చేసినా.. ఈ విషయంలో  ఎజెండా ఉండదు కాబట్టి...ఓటర్ల చాయిస్ వారిద్దరి మధ్యనే ఉంటుంది. అంటే గెలుపోటములు  కాంగ్రెస్, వైసీపీ మధ్యనే తేలే చాన్స్ ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Posts