విజయవాడ, మార్చి 23
ఎన్నికల యాత్రలకు అధినేతలు రెడీ అవుతున్నారు. ఒకవైపు సీఎం జగన్.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్…. ముగ్గురూ ఒకేసారి ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధం అంటున్నారు. హేమాహేమీ లీడర్లు ముగ్గురూ ఒకేసారి ఎన్నికల ప్రచార రంగంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో వచ్చే 15-20 రోజులు రాష్ట్రంలో ప్రచార పండగే.. కార్యకర్తల కోలాహలమే కనిపించనుంది. ముగ్గురు అగ్రనేతలు ఒకేసారి ప్రజల మధ్యకు వస్తుండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 175 నియోజకవర్గాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించగా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కూడా దాదాపు 135 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమిలో బీజేపీ మాత్రమే ఇంకా అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టగా, టీడీపీ 16 నియోజకవర్గాలకు, జనసేన 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది. ఒకవైపు టికెట్ ఖరారైన అభ్యర్థులు ప్రచార పర్వంలో బిజీబిజీగా ఉండగా, అధినేతలు జనం మధ్యకు వచ్చి ప్రచార ఉధృతిని మరింత పెంచనున్నారు.ఎన్నికల పండగలో ప్రచార కోలాహలానికి తెరలేవనుంది. వచ్చే నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఈ లోగా ఓ విడత రాష్ట్రాన్ని చుట్టేసే కార్యక్రమాన్ని తలపెడుతున్నారు ప్రధాన పార్టీల అధినేతలు. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ ముగ్గురూ మూడు వైపుల నుంచి ప్రచార రంగంలోకి దిగుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావారణం మరింత వేడెక్కనుంది.
జగన్ కన్నా ఒక్క రోజు ముందుగానే బరిలోకి చంద్రబాబు..
ఎన్నికలకు రెండు నెలల సమయం దొరకడంతో ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి పార్టీలు. అనుకోని వరంలా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు.. ప్రతిక్షణం విలువైనదిగా భావిస్తున్న పార్టీలు పక్కా వ్యూహాన్ని రూపొందిస్తున్నాయి. ఇప్పటికే మూడు పార్టీలూ ఒక దఫా ప్రచారాన్ని ముగించాయి. అయితే షెడ్యూల్ విడుదల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నేతలు.. నోటిఫికేషన్ వచ్చేలోగా మరోసారి రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్ ఈ నెల 27 నుంచి బస్సు యాత్రకు సిద్ధమవుతుండగా, దీనికి ఒక్కరోజు ముందు అంటే ఈ నెల 26 నుంచే ప్రచార రంగంలోకి దిగుతున్నారు చంద్రబాబు. మరోవైపు జనసేనాని పవన్ కూడా 27 నుంచి మలివిడత వారాహియాత్రకు రెడీ అవుతున్నారు.ఎన్నికలకు రెండు నెలల సమయం దొరకడంతో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యూహం రచిస్తోంది అధికార వైసీపీ. ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు మూలల్లో సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహించి.. మంచి ఊపుమీదున్న వైసీపీ.. క్యాడర్‌ను మరింత యాక్టివ్ చేసేందుకు బస్సు యాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు సీఎం జగన్. సెంటిమెంట్ ప్రకారం ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు.వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఏ కార్యక్రమం చేసినా, ఇడుపులపాయ నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తూ.. 27న బస్సుయాత్ర ప్రారంభిస్తున్నారు. తొలిరోజు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాయలసీల జిల్లాల్లోని నంద్యాల, ఎమ్మిగనూరులో వరుసగా 28, 29వ తేదీల్లో జరిగే సభల్లో ప్రసంగించనున్నారు సీఎం జగన్. 27 నుంచి బస్సు యాత్ర చేసే సీఎం రోజూ ఒక చోట భారీ బహిరంగ సభలో మాట్లాడేలా ప్లాన్ చేస్తున్నారు.సీఎం జగన్.. బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అవగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అదే సమయంలో ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించారు. ఇప్పటికే రా కదలిరా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు చంద్రబాబు. మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా నిజం గెలవాలన్న పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇక యువనేత లోకేశ్ శంఖారావం పేరుతో కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలకు కొనసాగింపుగా చంద్రబాబు.. ప్రజాగళం పేరుతో రోడ్‌షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు.. ఆ మరునాడు నుంచి అంటే ఈ నెల 26 నుంచి రోడ్‌షోలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.వచ్చే నెల 19న షెడ్యూల్ విడుదలయ్యేలోగా.. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గం చొప్పున పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. ఒక పార్లమెంట్ పరిధిలో రెండు నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించి, ఓ నియోజకవర్గంలో కార్యకర్తలతో భేటీ కావాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఇదే సమయంలో సినీ నటుడు, టీడీపీ కీలక నేత బాలకృష్ణ సైతం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇలా సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకేసారి రాయలసీమ జిల్లాలకు సిద్ధమవుతుండగా, మరో కీలక నేత, జనసేనాని పవన్‌కల్యాణ్ కూడా వారాహియాత్రకు రెడీ అవుతున్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించే 27నే పవన్ కూడా వారాహియాత్ర మొదలు పెడుతున్నారు. పవన్ పోటీ చేసే పిఠాపురం నుంచి వారాహి యాత్ర ప్రారంభమవనుండగా, మొత్తం 20 రోజుల పాటు 21 నియోజకవర్గాల్లో పర్యటించేలా వారాహి యాత్రకు డిజైన్ చేస్తున్నారు.