విజయవాడ, మార్చి 26
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు సిద్ధమవుతుండగా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో ఎన్నికల పోరుకు సన్నద్ధమవుతున్నారు. ఇద్దరు నేతలు ఒకేరోజు ప్రజల్లోకి వెళుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు పార్టీలు రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ఇరు పార్టీల అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతుండగా, వైసీపీ మరోసారి ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు ఇప్పటికే వైసీపీ సిద్ధం పేరుతో భారీగా బహిరంగ సభలను నిర్వహించింది. నాలుగు భారీ సభలు నిర్వహించిన తరువాత వైసీపీ కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ బుధవారం నుంచి సీఎం జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇడుపులపాయలో బుధవారం ప్రారంభం కానున్న బస్సు యాత్ర 21 రోజులపాటు కొనసాగి ఇచ్ఛాపురంలో ముగియనుంది. సీఎం జగన్ బుధవారం ఉదయం 10.56 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్ననానికి ఇడుపులపాయకు చేరుకుని రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేస్తారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలిరోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపురాయనిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోకజవర్గాలు మినిహా మిగిలిన 21 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది. సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ప్రజాగళం పేరుతో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. బుధవారం నుంచే ఈ యాత్రకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు వరుసగా పర్యటించనున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు నియోకజవర్గాల్లో ప్రజాగళం పేరుతో నిర్వహించనున్న యాత్రలో భాగంగా మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 27న చంద్రబాబు పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, శింగనమలై, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటించనున్నారు. సోమ, మంగళవారాల్లో ఆయన తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తారు. ఈ నెల 30వ తేదీ నుంచి పిఠాపురం నుంచి పవన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మూడు రోజుకు అక్కడే ప్రచారం చేసి తర్వాత మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. తొలి రోజు శ్రీ పురూహూతిక అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రచారంలో భాగంగా మండలాల వారీగా కీలక నేతలతో సమావేశం అవుతారు. స్థానికంగా ఉండే మేథావులతో కూడా పవన్ మాట్లాడనున్నారు.