విజయవాడ, మార్చి 26
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమాపై కాంగ్రెస్ పార్టీ కన్నేసినట్లు తెలుస్తోంది. అధికార వైసీపీ, తెలుగుదేశం పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను కాంగ్రెస్‌లోకి ఆ పార్టీ నాయకులు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారు ఎక్కువగా వైసీపీకి చెందిన వారే ఉన్నారు. మిగిలిన పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలపైనా కాంగ్రెస్ దృష్టి సారించినట్టు సమాచారం. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సూచన మేరకు కీలక నేతలు రంగంలోకి దిగి దేవినేనితో చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. చర్చలు సఫలం అయితే ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరికపై దేవినేని స్పష్టత ఇచ్చే అవకాశముంది. దేవినేని ఉమా మహేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. గత ప్రభుత్వ హయంలో మంత్రిగా కూడా పని చేశారు. గడిచిన ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసిన దేవినేని తన ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌పై ఓటమి చెందారు. ఓటమి పాలైనప్పటికీ రాజకీయంగా యాక్టివ్‌గానే ఉమా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో తనపై గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్‌పైనా అంతే స్థాయిలో విమర్శలు గుప్పించారు. వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగానూ పలుమార్లు విమర్శలు చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో గెల్చిన మైలవరం టికెట్‌ను పొందారు. ఇదే ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఆగ్రహానికి కారణమైంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా, అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగే తనకే టికెట్ కేటాయించకపోవడం పట్ల దేవినేని అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. మళ్లీ వెనక్కి తగ్గారు. కానీ, పార్టీ మార్పుపై ఆయన పునరాలోచిస్తున్నట్టు తెలిసింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చర్చలకు కారణమైనట్టు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సూచనలు మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పార్టీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఒక సీనియర్ నేతకు దేవినేని సన్నిహితంగా ఉంటారు. సదరు నేత ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఈ చర్చలను సాగిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలంటూ సదరు నేతలు రాయబారం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీని గెలిపించే బాధ్యతలను దేవినేని భుజస్కందాలపై పెట్టేందుకు సదరు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరికపై ఆలోచిస్తున్న దేవినేని ఒకటి రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. దేవినేని వంటి సీనియర్ నేత పార్టీని వీడితో మాత్రం తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో.