కాకినాడ, మార్చి 27
ఎన్నికల ప్రచారానికి పవన్ సిద్ధమయ్యారు. పొత్తులతో పాటు సీట్ల కేటాయింపు తుది దశకు చేరుకోవడంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పవన్ నిర్ణయించారు. తాను పోటీ చేయబోయే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈనెల 30 తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జనసేన 18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. టిడిపి తో పాటు బిజెపి అభ్యర్థుల ఎంపిక సైతం దాదాపు తుది దశకు చేరుకుంది. దీంతో ప్రచారం ముమ్మరం చేయాలని మూడు పార్టీలు నిర్ణయించాయి.ముందుగా అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠమైన శ్రీ పురూహూతీక అమ్మవారిని పవన్ దర్శించుకున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్త పీఠాన్ని సందర్శిస్తారు. మూడు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ ఉండనున్నారు. పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశం కానున్నారు. మండలాల వారీగా క్రియాశీలక నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి.. దిశా నిర్దేశం చేయనున్నారు. టిడిపి, బిజెపి నాయకులతో భేటీ కానున్నారు. ఇకనుంచి ఇతర ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్లాలన్నా.. పిఠాపురం నుంచి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఉగాది వేడుకలను సైతం పవన్ పిఠాపురంలో జరుపుకోనున్నారు.అటు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు మూడు విడతల్లో చేపట్టాలని పవన్ నిర్ణయించారు. జనసేన పోటీ చేయబోయే అన్ని నియోజకవర్గాల్లో పవన్ పర్యటన ఉంటుంది. అందుకు తగ్గట్టు షెడ్యూల్ ను పార్టీ వర్గాలు సిద్ధం చేస్తున్నాయి. మధ్యలో భాగస్వామ్య పక్షాల నేతలతో కలిసి ప్రచార వేదికలను పంచుకొనున్నారు. చంద్రబాబు, పురందేశ్వరి, బిజెపి అగ్ర నేతలు కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనన్నారు. జనసేన పోటీ చేయబోయే కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల పరిధిలో కూడా పవన్ ప్రచార సభలు ఎక్కువగా ఉండేలా జనసేన నేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచార శైలిపై పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ నేతలతో సమీక్షించారు. మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.పిఠాపురంలో పవన్ ను ఓడించాలని వైసీపీ పక్కా ప్లాన్ తో ఉంది. ఇప్పటికే అక్కడ తెలుగుదేశం తో పాటు జనసేన నాయకులను ఆకర్షించే పనిలో పడింది. వందల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు ఒకరకంగా ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ కూడా అలెర్ట్ అయ్యారు. ఎన్నికల వరకు పిఠాపురం లోనే ఉండడానికి డిసైడ్ అయ్యారు. పిఠాపురం నుంచి రాష్ట్రవ్యాప్త కార్యకలాపాలకు పవన్ శ్రీకారం చుట్టనున్నారు. జనసేన కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే జరపడానికి పార్టీ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి.