విజయవాడ, మార్చి 27
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని ఉద్యమానికి రైతులు తాత్కాలిక విరామం ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అమరావతి జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నియమావళి, పోలీసుల సూచనల నేపథ్యంలో తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు తెలిపింది. శిబిరాలు, రోడ్లమీద కాకుండా ఇళ్ల దగ్గరే నిరసన కార్యక్రమాలు చేపడతామని అమరావతి జేఏసీ తాజాగా ప్రకటించింది.అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 1560 రోజులుగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరికి టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు అండగా ఉన్నాయి. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలతో ఆందోళన కొనసాగిస్తున్నారు రైతులు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.కాగా, మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటించింది. శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని అంటోంది. అంతేకాదు రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. వైజాగ్ నుంచే పరిపాలన కొనసాగిస్తానని కూడా ఆయన వెల్లడించారు.