YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పొంచి ఉన్న నీటి గండం... సమ్మర్ కు ముందే త్రాగు నీటి కష్టాలు

 పొంచి ఉన్న నీటి గండం... సమ్మర్ కు ముందే త్రాగు నీటి కష్టాలు

హైదరాబాద్, మార్చి 27
వేసవి ప్రారంభంలోనే తెలంగాణలో తాగు, సాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. సాగుకు నీళ్లు అందక పొలాలు ఎండిపోతున్నాయి. ఇక ప్రధాన నగరాల్లో తాగు నీటి ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రజలు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. కర్ణాటకలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో అయితే తాగునీటికి మరింత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంతో... అధికంగా నీళ్లు వినియోగిస్తే ప్రభుత్వం జారిమానా విధించే స్థాయికి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కృష్ణా నది తీరంగా క్రాఫ్ హాలీడే ప్రకటించారు. ఎగువ నుంచి కృష్ణా నదికి నీరు రాకపోవడంతో తెలంగాణలో నీటి సమస్యలుఉద్ధృతం అవుతున్నాయి. గోదావరి పరీవాహకంలో సైతం ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.గత ఏడాది వర్షాలు బాగానే కురిసినా.... జలాశయాలు(, డ్యాంలు, చెరువుల్లో నీటిమట్టం క్రమంగా తగ్గిపోతుంది. కాలువ నుంచి నీరు అందకపోవడంతో రైతులు బోర్లపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. దీంతో ఉపరితల జలవనరులు తగ్గిపోతున్నాయి. ఎండలు తీవ్రంగా ఉండడంతో జలశయాల్లో నీటి వనరులు తగ్గడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. వేసవిలో సాధారణం కంటే నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. పైగా ఎండల తీవ్రతకు నీటి వనరులు తగ్గుతుంటాయి. తెలంగాణలో ప్రస్తుతం నీటి సమస్యలుప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో నీటి వినియోగం భారీగా పెరుగుతోంది. జలశయాల్లో నీరు తగ్గుతుండడంతో... అధికారులు తాగునీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో సాగుకు నీరు అంతంత మాత్రంగానే అందుతోంది. దీంతో పంటలు సాగు చేసిన రైతులు...బోర్లపై ఆధారపడుతున్నారు.కృష్ణా నదిపరీవాహకంలో ఈ ఏడాది వర్షాలు తగినంత పడలేదు. దీంతో ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహం తగ్గింది. ఎగువ నుంచి జూరాలకు 154 టీఎంసీలు, శ్రీశైలానికి 115 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. నారాయణపూర్ జలశయంలో ప్రస్తుతం 20 టీఎంసీలు నిల్వ ఉండగా.... వేసవి నీటి ఎద్దడిని తట్టుకునేందుకు తెలంగాణకు కనీసం 5 టీఎంసీలు నీరు దిగువకు విడుదల చేయాలని కర్ణాటకను( కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూరాల జలాశయంలో నీళ్లు అడుగంటుతున్నాయి. జూరాల కింద పంటలు ఎండిపోతున్నాయి. వానాకాలం తర్వాత కర్ణాటక నుంచి జూరాలకు కనీసంర 2.5 టీఎంసీల నీరు వచ్చేది కానీ ఈ ఏడాది నీరు రాలేదు. దీంతో జూరాలలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది.కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాల కారణంగా... ఈ ప్రాజెక్టుల్లో నీటిని ఖాళీ చేశారు. మేడిగడ్డ పిల్లర్లుకుంగడంతో...నీటిని దిగువకు వదిలేస్తున్నారు. అన్నారం బ్యారేజీలోనూ బుంగల కారణంగా నీటిని దిగువకు వదిలేశారు. ప్రస్తుతం ఎత్తిపోతలు నిలిచిపోవడంతో... ఎల్లంపల్లి, మిడ్, లోయర్ మానేరుల్లో నీటి మట్టాలు అడుగంటాయి. గత కొన్ని రోజులుగా ఈ జలాశయాల కింద సాగు, తాగునీటి అవసరాలకు పెద్దఎత్తున నీటిని వినయోగిస్తున్నారు. శ్రీరామసాగర్‌, మిడ్ మానేరు, లోయర్ మానేరు( నుంచి నీటి వినియోగం పెరిగింది. ఈ ప్రాజెక్టుల పరిధిలో నీటి సమస్యలు తలెత్తున్నాయి. ఈ జలశయాల దిగువన ఉన్న పొలాలకు సాగు నీరు అందకపోవడం పంటలు ఎండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టులో కూడా నీటి మట్టం వేగంగా తగ్గిపోతుంది. నదిలో ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 810.80 అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్ తో కూడా నీటి మట్టాలు వేగంగా తగ్గుతున్నాయి.హైదరాబాద్, కరీంనగర్, యాదాద్రి సహా పలు జిల్లాల్లో తాగునీటికి ప్రజలుఇబ్బంది పడుతున్నారు. భూగర్భజలాలు తగ్గిపోవడంతో... తగినంత తాగునీరు దొరక్క నగరాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి ఆరంభంలోనే ఎండలు తీవ్రంగా ఉండడంతో నీటి సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు అంటున్నారు. మార్చి నెల నాటికే భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోయాయి. చెరువులు, కాలువలు ఎండిపోతుంటే... నదుల్లో సైతం నీరు వేగంగా తగ్గిపోతుంది. ఉపనదుల్లో చుక్క నీరు కనిపించడలేదు. తెలంగాణ వ్యాప్తంగా 142 పట్టణాల్లో నీటి లభ్యత గణనీయంగా తగ్గిందని అధికారులు అంటున్నారు. మార్చి నాటికే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాబోయే రెండు నెలల్లో తాగునీటి సమస్యలు తీవ్రం అవుతాయని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో తాగునీటి సమస్యలు తీవ్రం కాకముందే ప్రభుత్వం క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తం చేసింది.

Related Posts