విశాఖపట్టణం, మార్చి 28
ఎట్టకేలకు అనకాపల్లి ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చేసింది వైఎస్ఆర్‌సీపీ. ప్రత్యర్థి ఎవరన్నది ప్రకటన వచ్చాక అన్నికోణాల్లో పరిశీలించింది. చివరకు డిప్యూటీ ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేరు ప్రకటించింది. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థి సీఎం రమేష్‌ని ఆయన ఢీ కొట్టనున్నారు.వైసీపీ హైకమాండ్ అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించింది. అయితే అనకాపల్లి సీటును మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఎందుకు పెండింగ్‌లో పెట్టిందన్న విషయం పార్టీలోని సీనియర్లకు మాత్రమే తెలుసు. మరే నాయకుడికి తెలీకుండా గోప్యంగా ఉంచింది. తొలుత అనకాపల్లి నుంచి జనసేన నుంచి నాగబాబు బరిలోకి దిగే ఛాన్స్ ఉందంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత సీఎం రమేష్ పేరిట ఫెక్సీలు కనిపించడంతో అందరిలోనూ అంచనాలు పెరిగాయి.రీసెంట్‌గా బీజేపీ విడుదల చేసిన జాబితాలో సీఎం రమేష్‌కు కేటాయించింది. వెంటనే ఆలస్యం చేయ కుండా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న బూడి ముత్యాలనాయడు పేరు ప్రకటించింది వైసీపీ. మాడుగుల అసెంబ్లీ సీటును ముత్యాలనాయుడు కూతురు అనురాధకు కేటాయించింది అధిష్టానం. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో మూడు కమ్యూనిటీలు గవర, కాపులు, కొప్పుల వెలమదే ఆధిపత్యం. వైసీపీ అభ్యర్థి ముత్యాలనాయుడు కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందినవారు. బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.