నెల్లూరు, మార్చి 28
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ఎంతో ప్రత్యేకమైనవి. జిల్లా వ్యాప్తంగా ఎవరు గెలిచినా, ఓడినా.. నగర నియోజకవర్గంలో గెలిచిన పార్టీకే పట్టు ఎక్కువగా ఉంటుంది. 2004 వరకు నెల్లూరు ఒకటే నియోజకవర్గం. 2009 నుంచి నెల్లూరు సిటీ, రూరల్ గా రెండు నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. రూరల్ నియోజకవర్గంలో కూడా సిటీలో ఉన్న కొన్ని డివిజన్లు కలుస్తాయి కానీ.. సిటీ నియోజకవర్గమే ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. నెల్లూరు నియోజకవర్గం వామపక్షాలు మినహా అన్ని పార్టీలను ఆదరించింది. కాంగ్రెస్, టీడీపీ, భారతీయ జనసంఘ్, ప్రజారాజ్యం.. అన్ని పార్టీలకు ఇక్కడ ప్రాతినిథ్యం ఉంది. మొదట్లో ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఇక్కడ బోణీ కొట్టింది. మాజీ మంత్రి, ఏసీ సుబ్బారెడ్డిగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం చెంచు సుబ్బారెడ్డి 1955లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత కాల క్రమంలో ఆనం వెంకట రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నెల్లూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పనిచేయడం విశేషం. అయితే ఇందులో ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు, మిగతా ముగ్గురు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.1967లో ఎం.ఆర్.అన్నదాత, భారతీయ జనసంఘ్ తరపున నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో తాళ్లపాక రమేష్ రెడ్డి కూడా నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా తాళ్లపాక రమేష్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆయనకు కూడా ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. 2009లో నెల్లూరు సిటీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో అనిల్ కుమార్ యాదవ్ వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. 2019లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్.. జగన్ కేబినెట్ లో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి నెల్లూరు నియోజకవర్గం అయినా, నెల్లూరు సిటీ అయినా.. మంత్రుల నియోజకవర్గంగా పేరుతెచ్చుకుంది. ఇక్కడ గెలిచిన వారికి కచ్చితంగా మంత్రి పదవి వరిస్తుందనే ప్రచారం ఉంది. ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకట రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. తాళ్లపాక రమేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్.. ఇలా వీరంతా నెల్లూరు నుంచి గెలిచి మంత్రి పదవులు స్వీకరించినవారే. ప్రస్తుతం నెల్లూరు సిటీలో హోరాహోరీ పోరు నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ తరపున పోటీ చేస్తారనుకున్నా.. ఆయన్ను నర్సరావు పేట ఎంపీ అభ్యర్థిగా పంపించిన సీఎం జగన్, ఇక్కడ ఖలీల్ అహ్మద్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దింపారు. టీడీపీ తరపున మాజీ మంత్రి నారాయణ గెలుపు తనదేనంటున్నారు. అనిల్ వర్సెస్ నారాయణ టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్నా.. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి నారాయణ ముందు నిలబడలేరనే ప్రచారం ఉంది. కానీ నెల్లూరు సిటీ నియోజకవర్గానికి జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలకులుగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు బాధ్యతలను ఆయనే భుజాన మోస్తున్నారు. ఈ నియోజకవర్గంలో నారాయణను ఓడించడం వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకవేళ నారాయణ గెలిచి టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆయన చంద్రబాబు మంత్రి వర్గంలో ఉంటారు. లేదా వైసీపీ అభ్యర్థి గెలిచి, జగన్ మరోసారి సీఎం అయితే మాత్రం ఈ విజయంతో చంద్రశేఖర్ రెడ్డికి మంత్రి పదవి లభించే అవకాశాలను కొట్టిపారేయలేం.