YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మండు వేసవిలోనూ జలకళ

మండు వేసవిలోనూ జలకళ
కరీంనగర్ జిల్లా ధర్మపురి పరిధిలోని రాయపట్నంలో నిత్యం ఉబికి వచ్చే జలధారలు స్థానికుల నీటి అవసరాలను తీర్చుతున్నాయి. అంతేకా కరవు కాలంలోనూ పచ్చటి పొలాలకు సాగు నీరు ఈ జలధారల ద్వారానే అందుతోందని అంతా అంటున్నారు. మండు వేసవిలోనూ తమ గ్రామంలోని చెరువులన్నీ నీటితో నిండి ఉండడానికి ఈ నీరే కారణమని స్థానికులు చెప్తున్నారు. రాయపట్నం గ్రామ శివారులో పరచుకున్న గుట్టల నుంచే నీరు ప్రవహిస్తుంటుంది. గుట్టల నుంచి వచ్చే వరదపాశమే తమకువరంగా మారిందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా వరి పొలాలకు సాగు నీరు అందకున్నా, ఈ గుట్టల నుంచి వచ్చే నీటినే సాగుకు ఆధారంగా మలచుకున్నారు రైతులు. ఎండ తీవ్రత అధికంగా ఉండే రాయపట్నంలో వరదపాశం గుట్టల్లో మాత్రం చల్లని వాతావరణం ఉంటుంది. చిన్నపాటి వర్షం పడిందంటే చాలు పెద్ద ఎత్తున గుట్టల నుంచి వరద వచ్చి రెండు చెరువుల్లోకి చేరుతుంది. ఈ నీటినే రెండు పంటలకు ఆసరాగా మలచుకున్నారు రైతులు. రెండు చెరువుల కింద వేయి ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండగా వరదపాశం వద్ద ఏడాది పొడవునా సమృద్ధిగా నీరు లభిస్తుంటుంది.
 
ఏడాదిలో అన్ని రోజులూ పెద్దయ్యగుట్ట దేవుని వద్ద వరదపాశం నుంచి  జలం వస్తుంది. ఇక్కడ భూగర్భజలాలు నిత్యం ఊరుతుండడమే కారణం. ఈనీరు చల్లగా, తీయగా ఉండటంతో భక్తులు, రైతులు వేసవిలో దాహార్తి తీర్చుకుంటారు. రాయపట్నంలో రెండు చెరువులున్నాయి. వీటి పరిధిలో దాదాపు వేయి ఎకరాల ఆయకట్టు ఉంటుంది. వీటికి ఈ వరదపాశం నీరే ఆధారం. రెండు పంటలకు సరిపడా సమృద్ధిగా నీరందుతుండడంతో రైతులకు సాగునీటి సమస్యలు పెద్దగా లేవు. నిండు వేసవిలోనూ సమృద్ధిగా జల వనరులున్న పెద్దయ్యగుట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అంతా కోరుతున్నారు. వరదపాశంతో పరిసర ప్రాంతాల్లోనూ భూగర్భ జల మట్టం తక్కువ లోతులోనే ఉంటుంది. చుట్టూ ఎత్తయిన గుట్టలు, ప్రకృతి రమణీయతను పంచే ఈ ప్రదేశానికి వెళ్లడానికి సరైన మార్గం లేదు. రహదారి నిర్మించడంతో పాటు విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ఇక ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్తున్నారు. మొత్తంగా రాయపట్నంలోని వరదపాశం.. స్థానికుల నీటి అవసరాలను తీర్చే పెద్ద దిక్కుగా ఉంది. ఇలాంటి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని అంతా అంటున్నారు.

Related Posts