YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చెట్టు పేరు చెప్పి..

 చెట్టు పేరు చెప్పి..
ప్రకాశం జిల్లా ఉలవపాడు అంటేనే గుర్తుకొచ్చేది మధుర ఫలమైన బంగినపల్లి మామిడి. సీజన్ లో ఈ ప్రాంతం బంగినపల్లికి ఎనలేని డిమాండ్ ఉంటుంది. ఇదిలాఉంటే చెట్టు కాయలకు ఉండే గిరాకీ అంతాఇంతా కాదు. ఎంత ఖర్చైనా కొనుగోలు చేసే వినియోగదారులు ఉంటారు. చెట్టు నుంచి నేరుగా కాయలు కోసి విక్రయానికి సిద్ధం చేస్తారు. వీటినే చెట్టు కాయలుగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాయలు చాలా నాణ్యమైనవి. వీటి ధర సాధారణ కాయలతో పోల్చితే కొంచెం ఎక్కువే. ఈ విషయం పక్కనపెడితే.. చెట్టు కాయలు కాని వాటిని చెట్టు కాయలుగా పేర్కొంటూ పలువురు వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నట్లు ఉలవపాడు వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చెట్టు కాయల పేరుతో నాసిరకం మామిడి పండ్లను అంటగడుతున్నారని అంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది కాపు ఆలస్యమైంది. వర్షపాతం ఆశించినంతగా లేకపోవడం దిగుబడిపై ఎఫెక్ట్ చూపింది. ఉన్న కొద్దిపాటి కాయల్లో అనేకం అకాలవర్షాల కారణంగా నేలరాలాయి. ఇక వడగాలులకు కాయలు పంటకు రాక గిటకబారి నేలరాలాయి. దీంతో వ్యాపారులు ఈ పండ్లనే గంపలలో కింది ప్రాంతంలో పేర్చుతూ కొనుగోలుదారులకు అంటగడుతున్న పరిస్థితి.  రసాయనాలను వాడి కాయలను పండిస్తున్నారన్న వార్తలూ చక్కర్లు కొడుతున్నాయి. వీటినే చెట్టు కాయలుగా అమ్ముతూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని అంటున్నారు.
 
ఉలవపాడు మామిడి పండు అంటేనే వినియోగదారులు నమ్మకంతో కొనుగోలు చేస్తుంటారు. ఈ నమ్మకాన్ని ఇక్కడి వ్యాపారులు వమ్ము చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. నేలరాలిన కాయలను రసాయనాలతో పండించి చెట్టును పండిన పండ్లే అంటూ మోసం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. రాలిన పండ్లను విక్రయించేందుకు ఇది ఒక ఎత్తైతే మరో పక్క గంపలలో, ట్రేలలో పై వరుస కాయలు నాణ్యత గల లావు కాయలు పేర్చి కింద చెత్త నింపి సన్నకాయలు, పనికి రానికి మచ్చకాయలు నింపుతున్నారనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పై కాయలు చూడగానే ఆకర్షణీయంగా, మంచిగాఉండటంతో మామిడి ప్రియులు ఆ ట్రేలను కొనుగోలు చేస్తున్నారు. తీరా ఇంటికెళ్లి చూసుకున్న తర్వాత లబోదిబోమంటున్నారు. మరోవైపు దిగుబడి లేకపోవడంతో మామిడి పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వారం రోజుల నుంచి ప్రారంభమైన పండు మామిడి మార్కెట్‌లో బంగినపల్లి 50 పండ్లు రూ.800- రూ.1000 వరకు ధర పలుకుతోంది. చెరుకు రసాలు 50 పళ్లు రూ.300-రూ.400 కాస్ట్ ఉంటోంది. ఇక నాటు రకాల ట్రే రూ.200- రూ.250 వరకు ఉంటోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నాలుగు వంతుల ధర పెరిగిందని వినియోగదారులు చెబుతున్నారు. మామిడి కాపు తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వ్యాపారులు అంటున్నారు.

Related Posts