YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాధ్యతాయుత భావిభారతం నిర్మాణంలో టీటీడీ

బాధ్యతాయుత భావిభారతం నిర్మాణంలో టీటీడీ
టీటీడీ ప్రసిద్ధ ధార్మిక క్షేత్రం. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ పాలనను పర్యవేక్షిస్తున్న ఈ సంస్థ సామాజిక బాధ్యతలోనూ ముందంజలోనే ఉంటోంది. ప్రధానంగా భావిభారత నిర్మాణం బాధ్యతలో చురుగ్గా పాలుపంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థలను ఏర్పాటుచేసి పిల్లలకు చదువుతోపాటు, నైతిక విలువలను బోధిస్తూ ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలన్న ఉన్నతాశయంతో టీటీడీ 1943లోనే తిరుపతిలో డిగ్రీ కళాశాలను ప్రారంభించింది. అనంతరం పలు పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేసింది. ఈ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు చదువుతోపాటు మానవీయ, నైతిక, ధార్మిక విలువలను బోధిస్తారు. ఈ విద్యాలయాలే కాక సామాజిక చైతన్యస్ఫూర్తి గల టీటీడీ బధిరుల కోసం, దివ్యాంగులు, అనాథలు, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాల్లోని పిల్లల కోసం పలు ప్రత్యేక శిక్షణ సంస్థలను నిర్వహిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో ప్రస్తుతం 6 డిగ్రీ, 2 జూనియర్‌ కాలేజీలు నడుస్తున్నాయి. 11 పాఠశాలలు, 2 పాలిటెక్నిక్‌ కళాశాలలు, ఒక సంగీత కళాశాల, ఒక ఆయుర్వేద కళాశాల, ఒక యోగ ఇనిస్టిట్యూట్‌, ఒక శిల్ప కళాశాల, 5 ప్రత్యేక ప్రతిభావంతుల శిక్షణ సంస్థలు, 6 వేద పాఠశాలలు సైతం ఉన్నాయి.
 
టీటీడీ విద్యాసంస్థల్లో 21 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 8500 మంది టీటీడీ ఆధ్వర్వంలో నడిచే హాస్టల్‌ లోనే ఉంటారు. ఇక ఈ విద్యాలయాల్లో 339 మంది శాశ్వత ఉపాధ్యాయులు, 363 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సాధారణ విద్యాసంస్థలను నడపడంతోపాటు సంప్రదాయ సంగీతానికి పెద్దపీట వేయడంలో భాగంగా దేశంలోనే మొదటిసారిగా శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల పేరుతో 1956 వ సంవత్సరంలో టీటీడీ ఒక కళాశాలను ప్రారంభించింది. ప్రత్యేకంగా యోగ శిక్షణ సంస్థ, ఆయుర్వేద కళాశాల, సంప్రదాయ ఆలయ నిర్మాణ శిక్షణ సంస్థలను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ మొత్తం విద్యాసంస్థల అభివృద్ధి కోసం టీటీడీ భారీగానే నిధులు వెచ్చిస్తోంది. రూ.50 కోట్లతో వార్షిక బడ్జెట్‌ కేటాయిస్తోంది. ఇదిలా ఉంటే విద్యార్థుల హాజరుశాతంతో పాటు ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది.త్వరలోనే అటెండెన్స్‌ అండ్‌ అకడమిక్‌ పర్‌ఫార్మెన్స్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనుంది. విలువలతో కూడిన మానవ సమాజం కోసం టీటీడీ విద్యాసంస్థల ద్వారా చేస్తున్న సేవలను అంతా ప్రశంసిస్తున్నారు.

Related Posts