YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పేరుకే సంక్షేమం..అంతా స్వలాభం..

పేరుకే సంక్షేమం..అంతా స్వలాభం..
నీరు- చెట్టు పథకం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారిందన్న విమర్శలు కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలో వెల్లువెత్తుతున్నాయి. సంక్షేమ పథకం పేరు చెప్పి పలువురు అక్రమార్కులు లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాల గురించిన తెలిసినా అధికారులు పట్టించుకోవడంలేదని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అధికార యంత్రాంగం ఉదాసీనతతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, నూజివీడు అన్నవరం పంచాయతీ పరిధిలో బహిరంగంగానే మట్టి వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రజల అవసరాలను గాలికి వదిలేసి నీటి సంఘాలను మభ్య పెడుతూ కొందరు మట్టి తవ్వకాలు సాగిస్తున్నారని స్థానికులు అంటున్నారు. స్థానికంగా మట్టి మాఫియా రెచ్చిపోతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోడంతో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగించేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారని మండిపడుతున్నారు. 
 
పంచాయతీ పరిధిలో కొత్త చెరువు, ఉప్పలకట్ట, కావడి చెరువు, కొన్నంగుంట చెరువు, పాపన్న చెరువులున్నాయి. ఇప్పటికే కావడి చెరువులో నీరు చెట్టు పథకం కింద పలు దఫాలుగా పనులు చేపట్టారు. 20 రోజులుగా కొత్త చెరువు ఉప్పల కట్టలో నీరు చెట్టు పథకం కింద కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారు. తాజాగా నూజివీడు - విస్సన్నపేట ప్రధాన రహదారి వెంబడి ఉన్న కొన్నంగుంట చెరువులో తవ్వకాలు ప్రారంభించారు. మొదట ఈ పథకం ద్వారా పూడిక తీసిన మట్టిని గ్రామంలోని శ్మశానాలు అభివృద్ధి చేసేందుకు ప్రారంభించారు. తరువాత పనులను పక్కన పెట్టి కొన్నిరోజులుగా ప్రొక్లెయిన్ల సహాయంతో వందలాది ట్రిప్పుల మట్టిని గ్రామ పరిధిలోని ఇటుకబట్టీ పరిశ్రమలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క బట్టీ వద్ద వేలాది ట్రిప్పుల మట్టిని నిల్వ చేస్తున్నారు. అలాగే అన్నవరం శివారు వెంకటాద్రిపురంలో ఓ ప్రయివేటు కాలేజీకి కూడా మట్టి తరలిస్తున్నారని చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు అటువైపుగా దృష్టి సారించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు సాగిస్తున్న మట్టి వ్యాపారానికి చెక్ పెట్టాలని కోరుతున్నారు. 

Related Posts